- రూ.73 కోట్లతో రెండో స్థానంలో వేములవాడ రాజన్న
- ఆ తర్వాత స్థానంలో కొండగట్టు, కొమురవెల్లి, బాసర, భద్రాచలం ఆలయాలు
- రూ.కోటి ఆదాయం దాటిన ఆలయాలు 100కు పైనే
- 2025–26 సంవత్సరానికి దేవాదాయశాఖ ఆదాయం రూ.556.11 కోట్లు
- కలిసివస్తున్న మహాలక్ష్మి స్కీంతోపాటు ప్రభుత్వ ప్రణాళికలు
రాష్ట్రంలోని ఆలయాలు ఆదాయంలో రికార్డులు సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో రెండు ఆలయాలు రూ.50 కోట్ల మార్కును దాటాయి. యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం రూ. 93.87 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా.. వేములవాడ రాజన్న టెంపుల్ రూ. 73.43 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు ఆధ్యాత్మికతతోపాటు ఆదాయంలోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. దేవాదాయశాఖ రూపొందించిన 2025–-26 ఆర్థిక సంవత్సరపు అంచనా నివేదిక ప్రకారం.. ప్రధాన ఆలయాల ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం గణనీయంగా పెరగడం విశేషం.
దర్శనం టిక్కెట్లు, హుండీ కానుకలు, ప్రసాదాల విక్రయాలు, వివిధ సేవల ద్వారా భారీగా ఆదాయం వచ్చిందని దేవాదాయశాఖ ఆఫీసర్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 2025-–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది. రాష్ట్రంలో 689 ఆలయాలు దేవాదాయశాఖ పరిధిలో ఉండగా.. దాదాపుగా రూ.556.11 కోట్లపైగా ఆదాయం వచ్చింది.
దీనికి సర్కార్ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి స్కీమ్‌తో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు. దీంతోపాటు ప్రధాన ఆలయాల వద్ద క్యూ, విశ్రాంతి గదులు, అన్నదాన భవనాలు, పార్కింగ్ సౌకర్యాలను మెరుగుపరచడంతో భక్తుల తాకిడి పెరిగింది. అర్జిత సేవలు, అభిషేకాలు, కల్యాణోత్సవం టిక్కెట్లను ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయం పెరగడంతోపాటు హుండీ కానుకల ద్వారా ఆదాయం వచ్చిందని చెప్తున్నారు.
- ఆదాయంలో యాదగిరిగుట్ట టాప్....
రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలు భక్తులతో కళకళలాడటమే కాకుండా ఆదాయంలోనూ దూసుకెళ్తున్నాయి. రాష్ట్రంలోని ఆలయాలను వాటి ఆదాయాన్ని బట్టి మూడు విధాలుగా వర్గీకరించారు. రాష్ట్రంలో కేవలం రెండు ఆలయాలు మాత్రమే రూ.50 కోట్ల మార్కును దాటాయి. అందులో యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం రూ. 93.87 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా.. వేములవాడ రాజన్న రూ. 73.43 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. అదేవిధంగా రూ.10 కోట్ల నుంచి 50 కోట్ల మధ్య కేటగిరీలో సుమారు 6 ప్రధాన ఆలయాలు ఉన్నాయి.
భద్రాచలం రూ. 31.3 కోట్లు, కొండగట్టు రూ. 21.9 కోట్లు, కొమరవెల్లి రూ.20.9 కోట్లు, బాసర రూ.17.8 కోట్లు, బల్కంపేట ఎల్లమ్మ రూ.12.5 కోట్లు, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి రూ.12.2 కోట్లు ఆదాయం సమకూరింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 346 ఆలయాల ఆదాయం రూ. కోటి నుంచి రూ.10 కోట్ల మధ్యలో ఉండటం విశేషం. చెరువుగట్టు రూ. 9.1 కోట్లు, కర్మన్‌ఘాట్ హనుమాన్ రూ. 8.7 కోట్లు, వరంగల్ భద్రకాళి రూ. 8.3 కోట్లు, ఏడుపాయల రూ.7.2 కోట్లు ఆదాయం వచ్చిన ఆలయాల జాబితాలో ఉన్నాయి.
- మహాలక్ష్మి ప్రభావం.. పెరిగిన వసతులు..
రాష్ట్రంలో ఆలయాల ఆదాయం గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరడం వెనుక సామాజిక, ఆర్థిక, పరిపాలనాపరమైన అనేక అంశాలున్నాయి. ఆలయాల ఆదాయం అమాంతం పెరగడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది.
బస్సు టిక్కెట్ల కోసం కేటాయించిన సొమ్మును భక్తులు హుండీ కానుకల రూపంలో, ప్రత్యేక పూజల రూపంలో లేదా ప్రసాదాల కొనుగోలుకు ఖర్చు చేస్తున్నారు. శని, ఆదివారాలే కాకుండా మంగళ, శుక్రవారాల్లో కూడా గ్రామీణ మహిళలు బృందాలుగా ఆలయాలకు పోటెత్తుతున్నారని దేవాదాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ముఖ్యంగా యాదగిరిగుట్ట, వేములవాడ, కొండగట్టు, కొమురవెల్లి వంటి క్షేత్రాలకు మహిళా భక్తుల తాకిడి 40% పెరిగినట్లు చెప్తున్నారు. ఇది హుండీ ఆదాయాన్ని అమాంతం పెంచింది. అదేవిధంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని పునర్నిర్మించిన తర్వాత అది కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యాటక క్షేత్రంగా బాసిల్లుతున్నది. దీనివల్ల ఆదాయం వంద కోట్లకు చేరువయ్యింది.
టాప్-10 ఆలయాల ఆదాయ గణాంకాలు (అంచనా 2025-26)
ఆలయం ఆదాయం (రూ..)
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి 93,87,26,189
వేములవాడ రాజరాజేశ్వర స్వామి 73,43,45,261
భద్రాచలం సీతారామచంద్ర స్వామి 31,34,12,128
కొండగట్టు ఆంజనేయ స్వామి 21,98,08,546
కొమురవెల్లి మల్లికార్జున స్వామి 20,97,93,968
బాసర జ్ఞాన సరస్వతీదేవి 17,82,33,280
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం 12,54,50,614
జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం 12,20,83,854
చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి 9,14,61,760
కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం 8,73,46,112
