ఆగస్టు మూడో వారంలో ..తమ్మిడికుంట, సున్నం చెరువు ప్రారంభం

ఆగస్టు మూడో వారంలో ..తమ్మిడికుంట, సున్నం చెరువు ప్రారంభం


హైదరాబాద్ నగరంలో ఆక్రమణల బారిన పడిన చెరువులను పునరుద్ధరించడమే లక్ష్యంగా  హైడ్రా  సరికొత్త రూపకల్పన చేస్తోంది. ఇందులో భాగంగా మాదాపూర్‌లోని తమ్మిడికుంట, సున్నం చెరువు అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా పరిశీలించారు. రాబోయే ఆగస్టు మూడో వారానికల్లా ఈ రెండు చెరువుల పునరుద్ధరణ పనులను పూర్తి చేసి, ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

వర్షపు నీరు నేరుగా చెరువుల్లోకి చేరేలా ఇన్‌లెట్లను, చెరువులు నిండినప్పుడు నీరు సురక్షితంగా బయటకు వెళ్లేలా ఔట్‌లెట్లను నిర్మించాలని ఆయన సూచించారు. వీటితో పాటు చెరువుల చుట్టూ బలమైన బండ్, విశాలమైన వాకింగ్ పాత్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రజల కోసం ప్రత్యేక పార్కులు, ఓపెన్ జిమ్‌లు, పిల్లల ప్లే ఏరియాలను అందుబాటులోకి తెస్తున్నారు.

►ALSO READ | ఛాంపియన్ అవ్వాలంటే కష్టపడాల్సిందే.. బ్రూస్ లీ జీవిత పాఠాలు చదవండి: మంత్రి వివేక్

చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా ఎస్‌టీపీ (STP) నిర్మాణాలను వేగవంతం చేయాలని, పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఆక్రమణలను నిర్దాక్షిణ్యంగా తొలగించి, సున్నం చెరువు విస్తీర్ణాన్ని 16.4 ఎకరాల నుంచి 30.5 ఎకరాలకు, అలాగే తమ్మిడికుంట విస్తీర్ణాన్ని 16.2 ఎకరాల నుంచి 29.3 ఎకరాలకు పెంచడం గమనార్హం.

వరద నియంత్రణ, భూగర్భ జలాల పెంపుతో పాటు ప్రజలకు పర్యావరణ పరిరక్షణ, వినోద సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు ఏవీ రంగనాథ్ సూచించారు.