ఛాంపియన్ అవ్వాలంటే కష్టపడాల్సిందే.. బ్రూస్ లీ జీవిత పాఠాలు చదవండి: మంత్రి వివేక్

ఛాంపియన్ అవ్వాలంటే కష్టపడాల్సిందే.. బ్రూస్ లీ జీవిత పాఠాలు చదవండి: మంత్రి వివేక్

మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారని తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రశంసించారు.  మార్షల్ ఆర్ట్స్,బాక్సింగ్ కేవలం ఒక క్రీడ మాత్రమే కాదని... స్వయం రక్షణ కోసం, మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.

మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం కష్టంతో కూడుకున్న పనే అయినప్పటికీ, దీని వల్ల మానసికంగా ఎంతో ధైర్యం పెరుగుతుందన్నారు. పిల్లల నుండి ఏమీ ఆశించకుండా చాలా తక్కువ ఫీజుతోనే అత్యుత్తమ శిక్షణ ఇస్తున్న ఓకినవ మార్షల్ ఆర్ట్స్ స్కూల్ నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

జీవితంలో గొప్ప ఛాంపియన్ అవ్వాలంటే కఠిన శ్రమ, క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని మంత్రి సూచించారు. ఎంత ఎత్తుకు ఎదిగినా తగ్గి ఒదిగి ఉండాలని... విజయం సాధించాలంటే వ్యూహం, క్రమబద్ధమైన ప్రాక్టీస్, పట్టుదల ఉండాలని పిలుపునిచ్చారు. ప్రసిద్ధ మార్షల్ ఆర్ట్స్ దిగ్గజం బ్రూస్ లీ జీవిత పాఠాలను చదివి ఆయన నుంచి నేర్చుకోవాలని కోరారు. భవిష్యత్తులో పిల్లలందరూ అద్భుతమైన ప్రతిభతో ఉన్నత స్థానాల్లో నిలవాలని ఆకాంక్షించారు.