- సూర్యాపేట వజ్ర మిల్లులో భారీగా మాయమైన సీఎమ్మార్
- ఇప్పటి వరకు రూ.50 కోట్ల విలువైన బియ్యం పక్కదారి పట్టినట్లు గుర్తింపు
- నల్గొండ జిల్లా డిండి సాయి వేంకటేశ్వర మిల్లులో 4 వేల కింటాళ్ల ధాన్యం గాయబ్
నల్గొండ, వెలుగు: సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో రెండో రోజూ విజిలెన్స్అధికారుల దాడులు కొనసాగాయి. సూర్యాపేటలోని వజ్ర రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారులు నిర్వహించిన సోదాల్లో భారీగా సీఎమ్మార్ మాయమైనట్లు గుర్తించారు. రూ.50 కోట్ల విలువైన బియ్యం మాయమైనట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం.
మిల్లు రికార్డుల్లో ఉన్న నిల్వలకు, గోడౌన్లలో ఉన్న స్టాకుకు పొంతన లేకపోవడంతో అధికారులు షాక్ తిన్నారు. మిల్లర్ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో తరలించినట్లు అనుమానిస్తున్నారు. 1.50 లక్షల క్వింటాళ్ల సీఎమ్మార్ మాయమైనట్లు ప్రాథమికంగా నిర్ధారించిన అధికారులు నివేదికను ఉన్నతాధికారులకు అందజేసినట్లు తెలుస్తోంది.
డిండిలోనూ అదే సీన్..
నల్గొండ జిల్లా డిండి మండల౦లోని శ్రీ సాయి వేంకటేశ్వర రైస్ మిల్లులోనూ రెండో రోజు విజిలెన్స్ తనిఖీలు కొనసాగాయి. ఈ మిల్లులో 4,970 క్వింటాళ్ల తేడా వచ్చినట్లు అధికారులు గుర్తించారు. 2022–23 సీజన్‌కు సంబంధించి టెండర్ పాడి ప్రభుత్వానికి రూ.1.20 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.35 లక్షలు మాత్రమే చెల్లించారు. వీటితో పాటు గత ఏడాదికి సంబంధించిన సీఎమ్మార్ వడ్లలోనూ 4 వేల క్వింటాళ్లకు పైగా వడ్ల లెక్కల్లో తేడాలు గుర్తించారు.
