సీజేపీ ఎప్పుడంటే అప్పుడు చర్చలకు రెడీ: కేంద్రం కీలక ప్రకటన

సీజేపీ ఎప్పుడంటే అప్పుడు చర్చలకు రెడీ: కేంద్రం కీలక ప్రకటన

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)తో చర్చలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సీజేపీ ఎప్పుడు కోరితే అప్పుడు చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించింది. నీట్ పేపర్ లీక్, సీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలపై బుధవారం (జులై 22) కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పందించారు. ఈ మేరకు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీజేపీ ప్రతినిధులతో తన చర్చలు స్నేహపూర్వక వాతావరణంలో జరిగాయని తెలిపారు. 

వారి సమస్యలను ఓపికగా విన్నామని చెప్పారు. సీజేపీ ప్రతినిధుల తమ డిమాండ్లను లిఖితపూర్వకంగా సమర్పించారని తెలిపారు. సీజేపీ ప్రతినిధులతో మరోసారి కేంద్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని చెప్పారు. సీజేపీ ఎప్పుడు కోరితే అప్పుడు చర్చలకు ప్రభుత్వం సిద్ధమని తెలిపారు. అలాగే, నీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్‎లో చర్చకు కేంద్రం సిద్ధంగా ఉందని కూడా చెప్పారు. ఎన్ని గంటలు చర్చ జరపాలనుకుంటున్నారో ప్రతిపక్షానికి వదిలేశామని పేర్కొన్నారు.

 మా ప్రభుత్వం బాధ్యతయుతంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ నీట్ పేపర్ లీక్ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా పేపర్లు లీక్ అయ్యాయని రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అలాగే, బీజేపీ హయాంలో 150 పేపర్లు లీక్ అయ్యాయన్న రాహుల్ గాంధీ ఆరోపణలపైన విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. పేపర్ లీక్ విషయంలో రాహుల్ గాంధీ పక్షపాత ధోరణి అవలంభిస్తున్నారని విమర్శించారు. 

బాధ్యత గల ప్రతిపక్ష నేతగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించి వారి భవిష్యత్ కు భరోసా కల్పించడం కోసం కాకుండా పేపర్ లీక్ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాడని విమర్శలు గుప్పించారు. పిల్లలు అంతా మనవారే. వారే దేశ భవిష్యత్తు. దేశ భవిష్యత్తును పరిరక్షించడం మన బాధ్యత. ఈ బాధ్యతలో ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షం కూడా పాలుపంచుకోవాలి. పేపర్ లీక్  సమస్యను పరిష్కరించి.. శాశ్వత పరిష్కారం దిశగా ముందుకు సాగడానికి మనమందరం కలిసి పనిచేయాలని హితవు పలికారు.