ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఖైరతాబాద్ REDCO డివిజనల్ ఇంజనీర్ ముత్యం వెంకట రమణను ఏసీబీ అధికారులుఅరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంతో పాటు కార్యాలయం, ఇతర సంబంధిత ప్రాంతాలతో కలిపి మొత్తం 9 చోట్ల సోదాలు చేసిన ఏసీబీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు.
ఈ సోదాల్లో వెంకట రమణకు చెందిన దిగ్భ్రాంతికరమైన అక్రమాస్తులు వెలుగు చూశాయి. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లిలో 4 నివాస ఫ్లాట్లతో పాటు, కూకట్‌పల్లిలో ఒక G+3 కమర్షియల్ భవనం, గుట్టల బేగంపేట్‌లో ఏకంగా G+5 కమర్షియల్ భవనాన్ని అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, ఆయన భార్య పేరిట 4 నిర్మాణ సంస్థల్లో భారీ పెట్టుబడులు ఉన్నట్లు, మూసాపేట్‌లో రూ. 20 కోట్ల వ్యయంతో 10 అపార్ట్‌మెంట్‌ల నిర్మాణం జరుగుతున్నట్లు ఏసీబీ తేల్చింది.
బ్యాంక్ ఖాతాల్లో రూ. 52 లక్షల నగదు, 2 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు, కియా, మహీంద్రా, బలేనో వంటి కార్లతో పాటు రూ. 30 లక్షల విలువైన గృహోపకరణాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా సోదాల్లో 20 మద్యం సీసాలు లభించడంతో ఆయనపై ఎక్సైజ్ కేసు కూడా నమోదైంది.
ప్రభుత్వ రికార్డుల ప్రకారం లభించిన ఆస్తుల విలువ రూ. 27.65 కోట్లుగా అంచనా వేయగా, బయట మార్కెట్ విలువ అంతకంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. 2019లో ఇప్పటికే రూ. 25 వేల లంచం కేసులో అరెస్టయిన ఈ అధికారిపై, ప్రస్తుత దర్యాప్తు కొనసాగుతుండగా ఆయనను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
