గలగలా ‘దేవాదుల’.. గోదావరి నుంచి 22 రిజర్వాయర్లలోకి నీటి పంపింగ్.. 12 జిల్లాల్లోని 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు

గలగలా ‘దేవాదుల’.. గోదావరి నుంచి 22 రిజర్వాయర్లలోకి నీటి పంపింగ్.. 12 జిల్లాల్లోని 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు

ఏడు పంపులతో నిత్యం 50 క్యూమెక్స్ నీటి తరలింపు
గ్రేటర్ వరంగల్ లో తాగునీటి సమస్య రాకుండా చర్యలు

ఎల్‌‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొని రిజర్వాయర్లు అడుగంటుతుండటంతో సాగు, తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం దేవాదుల ఎత్తిపోతల పథకంపై పూర్తిగా దృష్టి సారించింది. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసే పరిస్థితి లేకపోవడంతో గోదావరి నుంచి దేవాదుల ద్వారా నీటిని పంపింగ్ చేస్తూ 12 జిల్లాల్లో 3.16 లక్షల ఎకరాలకు సాగునీరు, గ్రేటర్ వరంగల్‌‌కు తాగునీరు అందించే చర్యలను వేగవంతం చేసింది.

హనుమకొండ, ములుగు, వెలుగు: ఎల్ నినో ప్రభావంతో అనావృష్టి నెలకొంది. జూన్ నుంచి అప్పటివరకు ఆశించిన వానలు పడకపోవడంతో రిజర్వాయర్లు వెలవెలబోతున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా సాగునీరు అందట్లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం లేకపోవడంతో  దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గంగారం నుంచి గోదావరి నీటిని లిఫ్ట్ చేస్తోంది. ప్రాజెక్టు పరిధిలోని 12 జిల్లాల్లో ఇప్పటికే 3.5 లక్షల ఎకరాలకుపైగా సాగునీటిని, గ్రేటర్ వరంగల్ ప్రాంతానికి తాగునీటిని అందించేందుకు చర్యలు చేపట్టింది. 

తగ్గిన నీటి నిల్వలు..

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గంగారం వద్ద గోదావరి నదిపై 2004లో జువ్వాడి చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా  38.16 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి 6.14 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలని టార్గెట్ పెట్టుకున్నారు.

ప్రాజెక్టు పరిధిలో 22 రిజర్వాయర్లు నిర్మించారు. థర్డ్ ఫేజ్ లో భూసేకరణ, ఇతర పెండింగ్ పనుల కారణంగా ఇప్పటివరకు 3.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. ఎల్​నినో ఎఫెక్ట్​తో ప్రస్తుతం వానలు లేకపోవడంతో ఈ రిజర్వాయర్లలో నీటిమట్టం చాలావరకు తగ్గిపోయింది. గ్రేటర్ వరంగల్ కు తాగునీరు, దేవాదుల ప్రాజెక్టులోని రిజర్వాయర్లకు నీటిని పంపింగ్ చేసే ధర్మసాగర్ రిజర్వాయర్  జలకళను కోల్పోయింది.

రోజుకు 50 క్యూమెక్స్ నీళ్లు ఎత్తిపోత..

వర్షాలు లేక సాగు సంక్షోభం తలెత్తే పరిస్థితి రావడంతో ప్రభుత్వం ఈ నెల 13న దేవాదుల ప్రాజెక్టును సమీక్షించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి వరంగల్​ ఇన్‌‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రాజెక్టును సందర్శించి పంపింగ్ వేగవంతం చేయాలని ఆదేశించారు.

ప్రస్తుతం 10 మోటార్లలో 7 మోటార్లు నడుస్తుండగా రోజుకు 50 క్యూమెక్స్(1,790 క్యూసెక్కులు) నీటిని భీమ్‌‌ ఘన్‌‌పూర్ రిజర్వాయర్‌‌కు ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి రామప్ప, పులుకుర్తి, చలివాగు పంప్‌‌హౌజ్‌‌ల ద్వారా ధర్మసాగర్‌‌కు నీటిని తరలిస్తున్నారు. మరో రెండు మోటార్లను కూడా రెండు, మూడు రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉందని 
అధికారులు తెలిపారు.

3.16 లక్షల ఎకరాలకు సాగునీరు..

ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి గండిరామారం, బొమ్మకూరు, తపాస్‌‌పల్లి, ఐనాపూర్, ఆర్‌‌ఎస్ ఘన్‌‌పూర్, అశ్వరావుపల్లి, చీటకోడూరు, నష్కల్, జాఫర్‌‌గడ్, పాలకుర్తి తదితర రిజర్వాయర్లకు నీటిని ఎత్తిపోస్తున్నారు. ప్రస్తుతం ధర్మసాగర్‌‌లో 1.2 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, పంపింగ్ సామర్థ్యానికి అనుగుణంగా మిగిలిన రిజర్వాయర్లకు కూడా నీటిని తరలించనున్నారు.

దేవాదుల పరిధిలోని 22 రిజర్వాయర్లు నిండితే ఉమ్మడి వరంగల్‌‌లోని హనుమకొండ, వరంగల్, జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలతో పాటు మెదక్, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లోని 17 నియోజకవర్గాల పరిధిలో 3.16 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. అలాగే గ్రేటర్ వరంగల్‌‌లోని సుమారు 11 లక్షల జనాభాకు తాగునీటి సరఫరా అందనుంది.

నెల రోజుల్లో అన్ని రిజర్వాయర్లు నింపుతం

ఎల్ నినో ప్రభావం వల్ల గోదావరిలో నీటి ప్రవాహం తగ్గిపోయింది. చత్తీస్ గడ్ వైపు కురుస్తున్న వర్షాల వల్ల గోదావరిలో వస్తున్న నీటిని దేవాదుల పంపులతో లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు నింపుతున్నం. సాగు అవసరాలు తీర్చడంతో పాటు ఏడాదికి సరిపడా తాగునీరు సరిపోయేలా చర్యలు తీసుకుంటున్నం. గోదావరిలో ప్రస్తుతం నెల రోజులకు సరిపడా నీళ్లున్నాయి. ఇప్పటికే రిజర్వాయర్లకు 40 నుంచి 50 శాతం నీటిని తరలించాం. నెల రోజుల్లో అన్ని రిజర్వాయర్లు నింపుతాం.- ఆర్.సుధీర్, సీఈ, దేవాదుల