ఓలా, ఉబెర్, ర్యాపిడో కంపెనీల ఓనర్లపై కేసు పెట్టండి.. మహారాష్ట్ర సర్కార్ సీరియస్ నిర్ణయం

ఓలా, ఉబెర్, ర్యాపిడో కంపెనీల ఓనర్లపై కేసు పెట్టండి.. మహారాష్ట్ర సర్కార్ సీరియస్ నిర్ణయం

మహారాష్ట్రలో ఓలా, ఉబెర్, ర్యాపిడో వంటి ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్ల యాజమాన్యాలకు అక్కడి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. రూల్స్ కి విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్న బైక్ టాక్సీ సర్వీసులపై రవాణా శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతి లేని బైక్ టాక్సీలను నడుపుతున్న యాప్ ఆధారిత సంస్థలపై తక్షణమే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి కేసులు బుక్ చేయాలని మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ను ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా లేఖ రాయడంతో ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది.

మహారాష్ట్రలో ఓలా, ఉబెర్, ర్యాపిడో సర్వీసులు పూర్తిగా బంద్ అయిపోయాయంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన మహారాష్ట్ర సమాచార, పౌర సంబంధాల డైరెక్టరేట్ ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. సదరు కంపెనీల సేవలు పూర్తిగా నిలిచిపోయాయనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవి కేవలం అవాస్తవాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం కేవలం అనధికారిక, చట్టవిరుద్ధమైన బైక్ టాక్సీ కార్యకలాపాలపై మాత్రమే చర్యలు తీసుకుంటోందని, మిగిలిన క్యాబ్ సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయని క్లారిటీ ఇచ్చింది.

మహారాష్ట్రలో బైక్ టాక్సీల లీగాలిటీ, లైసెన్సింగ్, రవాణా నిబంధనల ఉల్లంఘనలపై గత కొంతకాలంగా పెద్ద వివాదమే నడుస్తోంది. ట్రాన్స్‌పోర్ట్ రూల్స్ బేఖాతరు చేస్తూ.. యాప్‌ల ద్వారా టూ-వీలర్ టాక్సీ సేవలను ప్రోత్సహించడంపై ప్రభుత్వ వర్గాలు సీరియస్‌గా ఉన్నాయి. ఈ క్రమంలోనే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై, నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై కఠిన చర్యలకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ తీసుకున్న ఈ దూకుడు నిర్ణయంతో రవాణా రంగంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ మొత్తం వ్యవహారంపై ఓలా, ఉబెర్, ర్యాపిడో కంపెనీల యాజమాన్యాలు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.