- జూన్ 2 నుంచి క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్
- ఉద్యోగుల పెండింగ్ బిల్లులు
- 100 రోజుల్లో చెల్లించేలా చూస్తామని హామీ
- 5 డీఏల విడుదల, ఓపీఎస్ మళ్లీ తేవాలని సీఎస్‌కు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి
- సెక్రటేరియెట్‌లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ
హైదరాబాద్, వెలుగు:
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం వారంలో ఐదు రోజుల పని విధానాన్ని పరిశీలిస్తామని సీఎస్ కె.రామకృష్ణారావు తెలిపారు. అలాగే, జూన్ 2 నుంచి నగదు రహిత హెల్త్ స్కీమ్‌ను అమలు చేస్తామని, ఉద్యోగుల పెండింగ్ బిల్లులన్నింటినీ 100 రోజుల్లోపు చెల్లించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామన్నారు. శుక్రవారం సెక్రటేరియెట్‌లో సీఎస్ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది.
ఈ భేటీలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్, టీఎన్జీఓ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, టీజీఓ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు సహా గుర్తింపు పొందిన 15 ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.
పీఆర్సీ, బదిలీలు, వివిధ విభాగాల సమస్యలపై సీఎస్ కు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు.. అంతర్జాతీయ, జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని కోరారు. జూన్ 2 లోపే రెండో పీఆర్సీని అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. సీపీఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని, ఉద్యోగుల క్యాష్‌లెస్ పథకంతో తక్షణమే నగదురహిత వైద్యం అందించాలన్నారు.
రెవెన్యూలో తొలగింపుకు గురైన 632 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, ఎఫ్‌టీఎస్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఉపాధి హామీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్యోగుల విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన సీఎస్.. కొత్త హెల్త్ స్కీమ్ కోసం ఉద్యోగుల మూలవేతనంలో 1.5 శాతం వాటా, అంతే మొత్తంలో ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్‌తో ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిపిస్తామన్నారు.
రెండో పీఆర్సీ నివేదిక తుది దశకు చేరిందని, అది అందగానే ఉద్యోగ సంఘాలతో మరోసారి భేటీ అవుతామన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలుపై సీఎం, డిప్యూటీ సీఎంలతో చర్చిస్తామని, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారిని కూడా స్పౌస్ కేటగిరి పరిధిలోకి తెస్తామని హామీ ఇచ్చారు. ఇకపై సచివాలయంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలు, డైరెక్టరేట్ స్థాయిల్లోనూ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్‌లు పెడతామన్నారు.
- నెల రోజుల్లో పీఆర్సీ కమిటీ రిపోర్ట్
నెల రోజుల్లో పీఆర్సీ కమిటీ రిపోర్ట్ తెప్పించుకుంటామని సీఎస్ హామీ ఇచ్చినట్లు ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు వెల్లడించారు. రిపోర్ట్ వచ్చాక ఉద్యోగ సంఘాలతో మీటింగ్ నిర్వహిస్తామని సీఎస్ చెప్పారని నేతలు పేర్కొన్నారు. శుక్రవారం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ తరువాత సెక్రటేరియెట్ మీడియా పాయింట్ లో వారు మాట్లాడారు. 13 ఏళ్ల తరువాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేసి మీటింగ్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం, సీఎస్ లకు నేతలు కృతజ్ఞతలు తెలిపారు.
