బండి భగీరథ్ కేసులో.. అర్ధరాత్రి 11.40 వరకూ వాడివేడీగా వాదనలు.. ముందస్తు బెయిల్పై తీర్పు గురువారానికి వాయిదా

బండి భగీరథ్ కేసులో.. అర్ధరాత్రి 11.40 వరకూ వాడివేడీగా వాదనలు.. ముందస్తు బెయిల్పై తీర్పు గురువారానికి వాయిదా

బండి భగీరథ్‌ మధ్యంతర, ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి 11.40 గంటల వరకు సుదీర్ఘంగా వాదప్రతివాదనలు జరిగాయి. పిటిషనర్‌ తరఫున న్యాయవాది నిరంజన్‌ రెడ్డి, పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లె నాగేశ్వర్‌రావు, బాధితురాలి తరఫున సీనియర్‌ న్యాయవాది పప్పు నాగేశ్వర్‌రావు వాదనలు వినిపించారు.

పిటిషనర్‌కు ఏ పరిస్థితుల్లోనూ ముందస్తు బెయిల్‌ ఇవ్వరాదని బాధితురాలి తరఫు సీనియర్‌ న్యాయవాది పప్పు నాగేశ్వర్‌రావు గట్టిగా వాదించారు. ‘‘ఎఫ్‌ఐఆర్‌ దశలోనే నిందితుడికి రక్షణ కల్పించకూడదు. పోక్సో కేసులో బాధితురాలికి అండగా నిలబడాలి. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం కూడా బండి భగీరథ్‌ అరెస్టు కాకుండా రక్షణ కల్పించొద్దు. తీవ్ర అభియోగాల కేసు ఇది. ఏ కోణంలో చూసినా నిందితుడిని పోలీసులు విచారించాలి. ఇలాంటి కేసుల్లో నిందితుడు అరెస్టు అవ్వాల్సిందే. ఇక్కడ ప్రత్యేక పరిస్థితులు లేవు. బెయిల్‌ మంజూరు చేయడానికి వీల్లేదు. ఏడేళ్లలోపు శిక్ష పడే నేరాభియోగాలు కాదు. మేజర్‌ అని పిటిషనర్‌ చెప్పడం సరికాదు.

రికార్డుల ప్రకారం బాధితురాలు మైనర్‌. పిటిషనర్‌ తండ్రి ఉన్నత పదవిలో ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో పిటిషనర్‌కు ముందస్తు బెయిల్‌ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కేసు నిష్పక్షపాతంగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. పిటిషనర్‌ తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు బాధితురాలిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు” అని పేర్కొన్నారు. 

‘‘బాధితురాలు రూ.5 కోట్లు డిమాండ్‌ చేశారన్న పిటిషనర్‌ ఆరోపణలో నిజం లేదు. అంతకుముందు రూ.50 వేలను బాధితురాలికి ఇచ్చానని పిటిషనర్‌ చెబుతున్నారేగానీ ఆ మొత్తాన్ని బాధితురాలు తిరిగి పిటిషనర్‌కు ఇచ్చిన విషయాన్ని వెల్లడించడం లేదు. పిటిషనర్‌ ఇచ్చిన డబ్బు కంటే బాధితురాలు ఇచ్చిన డబ్బే ఎక్కువ. ఇక్కడ డబ్బు విషయం కాదు. పిటిషనర్‌ తాను ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే అతి విశ్వాసానికి బ్రేక్‌ వేయాలి. సీఆర్‌పీసీలో ఏ సెక్షన్‌ కింద పోక్సో చట్టం కింద నమోదైన కేసులో నిందితుడికి రక్షణ కల్పిస్తారు? దర్యాప్తునకు సహకరిస్తామని చెప్పి అరెస్టు కాకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరడాన్ని తీవ్రంగా పరిగణించాలి.

గత ఏడాది డిసెంబర్‌ 31న విభేదిస్తే మే 8వ తేదీ వరకు పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చేయలేదని ప్రశ్నించి ఉపశమనం పొందలేరు. బాధితురాలు మైనర్‌. ఫిర్యాదుదారులైన తల్లి అనేక కోణాల్లో బాధితురాలైన కుమార్తె గురించి మల్లగుల్లాలు పడుతుంది. కేసుల వారీగా సమస్యను చూడాలి. కేసులోని ఆరోపణలు, ఆధారాలు పరిశీలించాలి. పోలీసులు బాధితురాలి నుంచి స్వీకరించిన 161 స్టేట్‌మెంట్‌ తర్వాత పోక్సో చట్టంలో 5, 6 సెక్షన్లు చేర్చుతూ ఎఫ్‌ఐఆర్‌లో మార్పులు చేయడాన్ని కూడా హైకోర్టు తీవ్రంగా పరిగణించాలి’’ అని వాదించారు.

వాదనలు పూర్తయిన తర్వాత తిరిగి నిరంజన్‌ రెడ్డి పిటిషనర్‌ అరెస్టు కాకుండా రక్షణ కల్పించాలని కోరగా, పప్పు నాగేశ్వర్‌రావు తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. వాదనల తర్వాత న్యాయమూర్తి స్పందిస్తూ, తాము ఇప్పుడేమీ ఉత్తర్వులు జారీ చేయబోమని ప్రకటించారు. వెకేషన్‌ బెంచ్‌ తిరిగి గురువారం విచారణ చేస్తుందని, అప్పటి వరకు తీర్పును రిజర్వు చేస్తున్నట్లు వెల్లడించారు. కనీసం తీర్పు వెలువరించే వరకు అయినా పిటిషనర్‌ అరెస్టు కాకుండా మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని నిరంజన్‌ రెడ్డి చేసిన అభ్యర్థనను తోసిపుచ్చారు. 

13 గంటలు.. 95 కేసులు.. జస్టిస్‌ మాధవీదేవి రికార్డ్ 
గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక న్యాయమూర్తి 13 గంటలకుపైగా హైకోర్టులో కేసులను విచారించారు. శుక్రవారం ఉదయం 10.30 నుంచి రాత్రి 11.30 వరకు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మాధవీదేవి కేసుల విచారణ జరిపారు. ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు వరకు సింగిల్‌ బెంచ్‌లో, మధ్యాహ్నం 2.15 గంటల నుంచి 5 గంటలు దాటే వర కు డివిజన్‌ బెంచ్‌లో (21 కేసులు) విచారణ జరిపారు.

తర్వాత తిరిగి సింగిల్ బెంచ్​లో జస్టిస్‌ మాధవీదేవి కేసుల విచారణ చేపట్టారు. ఉదయం నుంచి సింగిల్‌ బెంచ్‌లో 74 కేసులను విచారించారు. మొత్తం ఒకేరోజు 95 కేసుల విచారణ చేపట్టారు. మధ్యలో అరగంటపాటు భోజన విరామం తర్వాత కేసులను విచారించారు. ఏకబిగిన ఒక రోజులో దాదాపు 13 గంటలపాటు జస్టిస్‌ మాధవీదేవి కేసుల విచారణ చేపట్టడాన్ని న్యాయవర్గాలు కొనియాడుతున్నాయి.