దేశ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ రేట్లను జనానికి నొప్పి తెలియకుండా జస్ట్ లీటరుకు రూ.3 మాత్రమే పెంచింది మోడీ సర్కార్ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తి కాగానే. అయితే ఆయిల్ కంపెనీలు మాత్రం ఇది అస్సలు సరిపోదని కనీసం మరో రూ.25 పెంచితేనే తమకు వస్తున్న నష్టాలు పూడుతాయని అంటున్నాయి. ప్రభుత్వం రానున్న నెలల్లో రెండు మూడు విడతలుగా రేట్ల పెంపుతో ఈ నష్టాల గ్యాప్ తగ్గించొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే రేట్లు పెంచుతున్నా కంపెనీలకు మాత్రం ఆ బెనిఫిట్ దక్కట్లేదంట. రేట్లు పెంచినా ఆయిల్ సంస్థలకు నష్టాలు తగ్గకపోవటానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి..
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వల్ల ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు(OMCs) కాస్త ఊరట లభిస్తుందని అందరూ భావించారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతూ రికార్డ్ కనిష్టాలను తాకుతుండటంతో.. పెట్రోల్ రేట్ల పెంపు వల్ల వచ్చే ప్రయోజనాలన్నీ బూడిదలో పోసిన పన్నీరులా మారిపోతున్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ తన తాజా ‘ఎకోక్రాప్’ రిపోర్టులో వివరిస్తూ బాంబు పేల్చింది.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నా.. దేశీయంగా రిటైల్ ధరలను మార్చకపోవడం వల్ల చమురు కంపెనీలు రోజుకు దాదాపు వెయ్యి కోట్ల రూపాయల మేర నష్టపోతున్నాయని స్టేట్ బ్యాంక్ అంచనా వేసింది. అంటే ఏడాదికి సుమారు రూ.3లక్షల 6 వేల కోట్ల నష్టం అన్నమాట. ఇప్పుడు పెంచిన లీటరుకు రూ.3ల వల్ల కంపెనీలకు రూ.52వేల 700 కోట్ల వరకు ఊరట లభిస్తుంది. కానీ ఇది వారు ఎదుర్కొంటున్న మొత్తం నష్టంలో జస్ట్ 15 శాతం మాత్రమే. మిగతా 85 శాతం నష్టం అలాగే కొనసాగుతూ కొండలా పేరుకుపోతోంది.
అయితే అసలైన ప్రమాదం దేశీయ ఇంధన ధరలతో కాదు.. పడిపోతున్న భారత రూపాయి విలువతోనే అంటోంది ఎస్‌బీఐ రీసెర్చ్. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరో రూ.2 పడిపోతే.. ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెంచడం వల్ల చమురు కంపెనీలకు వచ్చిన లాభాలన్నీ పూర్తిగా ఆవిరై ప్రయోజనం సున్నా అవుతుందట. డాలర్ విలువ రూ.94 కి చేరి.. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ బ్యారెల్ ధర 106 డాలర్లకు పెరిగితే, భారతదేశానికి వచ్చేసరికి ఒక బ్యారెల్ ముడి చమురు ధర రూ.9వేల 964 అవుతుంది. ఇప్పుడు పెంచిన రూ.3 ధర వల్ల కంపెనీలకు బ్యారెల్‌పై రూ.477 లబ్ధి చేకూరుతుంది. కానీ రూపాయి మరింత బలహీనపడితే ఆ దిగుమతి ఖర్చు పెరిగి రేటు పెంచటం వల్ల వచ్చిన ప్రయోజనం కాస్తా సున్నాగా మారిపోతుందని స్టేట్ బ్యాంక్ రీసెర్చ్ లెక్కగట్టింది.
గ్లోబల్ మార్కెట్‌లో వచ్చే ఈ చమురు షాకులు నేరుగా మన రూపాయి విలువపై ప్రభావం చూపుతున్నాయని ఎస్‌బీఐ నివేదిక స్పష్టం చేసింది. రూపాయి విలువ పతనం కావడం వల్ల దేశీయంగా పెట్రోల్ ధరలను ఎంత పెంచినా ప్రయోజనం లేకుండా పోతోంది. కరెన్సీ స్థిరత్వం సాధించనంత కాలం, క్రూడాయిల్ ధరలు అదుపులోకి రానంత కాలం ఆయిల్ కంపెనీలకు చుక్కలు కనిపిస్తాయని రీసెర్చ్ రిపోర్ట్ తేల్చేసింది. పెట్రోలియం కంపెనీలు బతకాలంటే ముందు రూపాయి బలపడాల్సిందేనట. రేట్ల పెంపుతో తాత్కాలికంగా ఉపశమనం ఇద్దామని మోడీ సర్కార్ ప్లాన్ చేస్తే పడిపోతున్న రూపాయి దీన్ని తలకిందులు చేస్తోందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. చూడాలి మోడీ దీనిని ఎలా హ్యాండిల్ చేస్తారో అన్నది.
