12 నుంచి 5 గంటల వరకు స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో సర్వీస్ బంద్

12 నుంచి 5 గంటల వరకు స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో సర్వీస్ బంద్

పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ.. గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ (GIPSWU) శనివారం ఐదు గంటల సమ్మె చేయాలని నిర్ణయించింది. ఈ కారణంగా ఐదు గంటల పాటు దేశవ్యాప్తంగా స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో సేవలు నిలిచిపోనున్నాయి. 

శనివారం మధ్యాహ్నం 12:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు.. గిగ్ వర్కర్లు తమ యాప్‌లను ఆఫ్‌లైన్‌లో ఉంచుతారు. దీనివల్ల ఆన్‌లైన్‌లో వస్తువులను ఆర్డర్ చేసే వారికి ఇబ్బందులు తప్పవు. ఈ సమ్మె కారణంగా స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఆన్‌లైన్ డెలివరీ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.

దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్పై సుమారు 3 రూపాయలకు పైగా ధరలు పెరగడంతో.. కిలోమీటరుకు సర్వీస్ రేట్లను తక్షణమే పెంచాలని GIPSWU శుక్రవారం డిమాండ్ చేసింది. అంతేకాకుండా, ఇంధన ధరల పెరుగుదల తమను మరింత ఆర్థిక ఒత్తిడిలోకి నెడుతోందని సదరు యూనియన్ ఆవేదన వ్యక్తం చేసింది. 

లక్షల మంది డెలివరీ బాయ్స్, డ్రైవర్లు.. పెరుగుతున్న ఇంధన ధరల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. పెట్రోల్, డీజిల్ కోసమే ఎక్కువ ఖర్చు చేస్తూ.. చేతిలో చివరకు తక్కువ డబ్బు మిగులుతున్న పరిస్థితి ఉందని యూనియన్ తెలిపింది. తమ రోజువారీ ఆదాయం కోసం మోటార్‌సైకిళ్లు, స్కూటర్లపై ఆధారపడే దాదాపు 1.2 కోట్ల మంది గిగ్ వర్కర్లపై ఇంధన ధరల పెంపు తీవ్ర ప్రభావం చూపిందని GIPSWU వివరించింది.