దేశంలో ఇన్సూరెన్స్ అనగానే చాలా మంది పెట్టుబడిగా, టాక్స్ ఆదా చేసుకునేందుకు మార్గంగానే చూస్తుంటారు. అందుకే దేశంలోని ప్రముఖ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇప్పటికీ ULIP పాలసీల అమ్మకాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. తాజాగా FY26లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. అయితే ఇన్సూరెన్స్ కంపెనీలు తమ వ్యాపార ధోరణిని మార్చుకోవాలని, ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ కంటే ప్రజల జీవితాలకు నిజమైన రక్షణనిచ్చే ప్రొటెక్షన్ ప్రొడక్ట్స్ అదేనండీ టర్మ్ ఇన్సూరెన్స్ లాంటివి అమ్మడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాలని నిపుణులు గట్టిగా చెబుతున్నారు.
ఈ క్రమంలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ బ్యాంకింగ్ & సబ్సిడరీస్ మేనేజింగ్ డైరెక్టర్ అశ్విని తివారీ సంచలన కామెంట్స్ చేశారు. ఇన్సూరెన్స్ కంపెనీల ప్రాథమిక బాధ్యత ప్రజలకు రక్షణ కల్పించడమేనని.. కానీ దురదృష్టవశాత్తూ ప్రస్తుతం మొత్తం ఇన్సూరెన్స్ సంస్థల్లో ప్రొటెక్షన్ ప్రొడక్ట్స్ వాటా కేవలం 10 శాతంగానే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఇన్సూరెన్స్ కంపెనీల కోణంలో చూస్తే యులిప్స్ అమ్మడం అంత మంచి ఆలోచన కాదని అన్నారు. భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థ అయిన ఎస్‌బీఐ లైఫ్ కూడా తమ ప్రొడక్ట్ మిక్స్‌లో 39 శాతం, యాన్యువలైజ్డ్ ప్రీమియం ఈక్వివలెంట్ పరంగా ఏకంగా 59 శాతం యులిప్స్ పాలసీలనే అమ్ముకుంటోంది.
ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం యులిప్స్ వంటి మార్కెట్ ఆధారిత ప్లాన్స్ వైపే కాకుండా, ప్రొటెక్షన్ ప్రొడక్ట్స్ వైపు ఎందుకు మళ్లాలో వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. ప్రొటెక్షన్ ప్లాన్స్ కుటుంబ యజమాని లేని సమయంలో ఫ్యామిలీకి ఆర్థిక భరోసానిస్తాయి. చాలా తక్కువ ప్రీమియంతో ఎక్కువ మొత్తానికి లైఫ్ కవరేజ్ లభించడం దీని ప్రధాన ప్రయోజనం. వ్యక్తిగత లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై కేంద్ర ప్రభుత్వం GST మినహాయింపు ఇవ్వడంతో ఇప్పుడు ప్రొటెక్షన్ ప్రొడక్ట్స్ మరింత చౌకగా మారాయి. యులిప్స్ లాగా ఇవి స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉండవు. ఈక్విటీ మార్కెట్లు బలహీనపడినప్పుడు యులిప్స్ పై ప్రభావం పడుతుంది. కానీ ప్రొటెక్షన్ ప్లాన్స్ సురక్షితంగా ఉంటాయి. ప్రస్తుతం చాలా మంది ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్లు తమకు ఎక్కువ కమీషన్లు వచ్చే యులిప్స్ ప్రొడక్ట్స్ ను మాత్రమే కస్టమర్లకు అంటగడుతున్నారు. దీనివల్ల కస్టమర్ నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రొటెక్షన్ ప్లాన్స్ పెరిగితే ఈ కక్కుర్తి తగ్గుతుంది.
గత రెండేళ్లుగా తాము యులిప్స్ పై కాకుండా, నాన్-యులిప్ అండ్ ప్రొటెక్షన్ పాలసీలను అగ్రెసివ్‌గా ప్రమోట్ చేస్తూ సమతుల్య బడ్జెట్ ను సాధించడానికి ప్రయత్నిస్తున్నామని ఎస్‌బీఐ లైఫ్ ఎండీ & సీఈఓ అమిత్ జింగ్రాన్ చెప్పారు. బ్యాంకింగ్ రంగం మినహా మిగిలిన అన్ని ఆర్థిక రంగాలలో ఇన్సూరెన్స్ వ్యాప్తి కేవలం 4-5 శాతంగానే ఉంది. కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు కేవలం లాభాల కోసమే ప్రొడక్ట్స్‌ని పుష్ చేయకుండా.. కస్టమర్లకు వాటిలోని లాభనష్టాలను, అసలైన రిస్క్ ఫ్యాక్టర్లను స్పష్టంగా వివరించాల్సిన బాధ్యత బ్యాంకులతో పాటు ఇన్సూరెన్స్ కంపెనీలపై ఉంది. లాభాల కక్కుర్తి వీడి, ప్రజలకు నిజమైన రక్షణనిచ్చే ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ వైపు అడుగులు వేసినప్పుడే దేశంలో నిజమైన ఇన్సూరెన్స్ చైతన్యం వస్తుంది.
