ఇంటర్ ఫెయిలై డాక్టర్ అవతారమెత్తి.. వారాసిగూడలో నకిలీ డాక్టర్ అరెస్ట్

 ఇంటర్ ఫెయిలై డాక్టర్ అవతారమెత్తి.. వారాసిగూడలో నకిలీ డాక్టర్ అరెస్ట్

హైదరాబాద్ నగరంలో నకిలీ వైద్యుల గుట్టు రట్టవుతోంది. తాజాగా వారాసిగూడలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక నకిలీ డాక్టర్‌ అక్రమ ధందాను హైదరాబాద్ సిటీ పోలీసులు మట్టుబెట్టారు. ఎలాంటి అర్హత లేకుండా, అక్రమంగా క్లినిక్ నడుపుతూ ప్రజలకు ఇంజక్షన్లు ఇస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం... వారాసిగూడలో మాధవ మెడికల్ షాప్ పేరుతో ఈ అక్రమ వ్యాపారం సాగుతోంది. నిందితుడిని భూపాలపల్లికి చెందిన  నన్నుట మాధవ్‌గా పోలీసులు గుర్తించారు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన ఈ 42 ఏళ్ల నిందితుడికి... ఎలాంటి వైద్య లేదా ఫార్మసీ అర్హతలు లేవు. కానీ ఎలాగైనా సరే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో ఇతడు డాక్టర్ అవతారమెత్తాడు.

తనకు అర్హత లేకపోయినా... కుంట అర్చన అనే స్నేహితురాలి డ్రగ్ లైసెన్స్‌ను అడ్డం పెట్టుకుని ఇతను ఇన్నాళ్లూ గుట్టుచప్పుడు కాకుండా వైద్యం చేస్తూ వచ్చాడు. పక్కా  సమాచారంతో దాడి చేసిన వారాసిగూడ పోలీసులు... నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద ఉన్న ఇంజక్షన్లు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్ లేని ల్యాబ్‌లు, నకిలీ వైద్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.