కార్పొరేట్ ప్రపంచంలో మేనేజర్ అంటేనే ఎప్పుడూ టార్గెట్లు, డెడ్‌లైన్లతో టెన్షన్ పెట్టే వ్యక్తి అనే ముద్ర ఉంటుంది. కానీ ఒక ఉద్యోగిని పడుతున్న శారీరక ఇబ్బందిని, ఆమె చెప్పకపోయినా అర్థం చేసుకుని మేనేజర్ వ్యవహరించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నళిని ఉనాగర్ అనే ఎక్స్ యూజర్ షేర్ చేసిన ఒక వాట్సాప్ చాట్ స్క్రీన్‌షాట్ ఇప్పుడు నెటిజన్ల మధ్య ఒక పెద్ద చర్చకు తెరలేపింది. నిజమైన మగవాళ్లు మహిళలను కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేలా చేస్తారు.. అంతేగానీ గిల్టీగా ఫీల్ అవ్వనివ్వరు అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ చాట్ కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఒక మహిళా ఉద్యోగిని తనకు ఆరోగ్యం బాగోలేదని, మధ్యాహ్నం 12 గంటల తర్వాత లాగిన్ అవుతానని తన మేనేజర్‌కు మెసేజ్ చేసింది. దానికి ఆ మేనేజర్ ఎంతో సానుకూలంగా స్పందిస్తూ 'ఓకే.. నో వర్రీస్' అని రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకునేందు సదరు మేనేజర్ "ఏదైనా సీరియస్ ప్రాబ్లమా?" అని ఆమెను అడిగాడు. దానికి ఆమె "ఏం లేదు, నార్మల్ బాడీ పానిక్" అని సమాధానమిచ్చింది. దాంతో ఆ మేనేజర్ పరిస్థితిని అర్థం చేసుకుని ఓహో.. పీరియడ్స్ నా? అని అడిగాడు. ఆమె అవునని కన్ఫర్మ్ చేయడంతో.. కంపెనీలో పీరియడ్స్ సమయంలో ఆరోగ్యం బాగోలేకపోతే 2-3 రోజులు లీవ్ తీసుకోవచ్చు.. జీతం కట్ అవుతుందేమో అని అస్సలు భయపడొద్దు.. బిందాస్ ఆరామ్ కరో అంటూ రెస్ట్ తీసుకోమని భరోసా ఇచ్చాడు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్దిసేపటికే వైరల్ అవ్వడమే కాకుండా.. నెటిజన్లను రెండు వర్గాలుగా చీల్చేసింది. ఒక వర్గం వారు మేనేజర్ చూపించిన మానవత్వాన్ని, సానుభూతిని పొగుడుతున్నారు. ఆయన పీరియడ్స్ అని అంత ఓపెన్‌గా అడిగిన విధానానికి సెల్యూట్.. అదే వేరే మేనేజర్ అయితే ఈ పాటికి పోష్ కేసు అయ్యేది అని కొందరు ప్రశంసించారు. అయితే మరో వర్గం వారు మాత్రం మేనేజర్ ప్రొఫెషనల్ లిమిట్స్ దాటారంటూ విమర్శిస్తున్నారు. ఉద్యోగి అనారోగ్యంతో లీవ్ అడిగినప్పుడు ఓకే చెప్పాలి కానీ.. పర్సనల్ విషయాల్లోకి దూరి ఆ ప్రాబ్లం ఏంటో అడగాల్సిన అవసరం లేదని అంటున్నారు.
మరికొందరు మేనేజర్లు ఈ చాట్‌పై స్పందిస్తూ.. కార్పొరేట్ లైఫ్‌లో ఉద్యోగులపై ఇంత ఉదారత చూపిస్తే వాళ్లు పనిని తేలికగా తీసుకుంటారని, అది చివరకు మేనేజర్ ఉద్యోగానికే ఎసరు తెస్తుందని ప్రాక్టికల్ కామెంట్లు చేశారు. అలాగే తోటి మగ ఉద్యోగులు కూడా ఇలాంటి సమయాల్లో అదనపు పని భారాన్ని మోయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ కంపెనీ పాలసీని అమలు చేస్తూనే.. తోటి ఉద్యోగి పట్ల ఆ మేనేజర్ చూపించిన చొరవ చాలామంది హృదయాలను గెలుచుకుంది.
