దేశంలోని ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ తమ సేవింగ్స్ అకౌంట్ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. సేవింగ్స్ అకౌంట్లలో క్యాష్ డిపాజిట్, విత్ డ్రా లావాదేవీలకు సంబంధించి ఛార్జీలను పెంచింది. ఈ కొత్త నిబంధనలు 2026 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఉచిత పరిమితిని దాటి లావాదేవీలు నిర్వహించే కస్టమర్లపై ఈ పెంపు ప్రభావం పడనుంది.
బ్యాంక్ నిబంధనల ప్రకారం.. సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లు నెలకు 3 ఉచిత క్యాష్ డిపాజిట్లు, 3 ఉచిత డబ్బు విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. అలాగే డిపాజిట్లు, విత్డ్రాల్స్ రెండింటికీ సంబంధించి రూ. లక్ష వరకు ఉచిత నెలవారీ లావాదేవీల పరిమితిని బ్యాంక్ అలాగే కొనసాగిస్తోంది.
పెరిగిన ఛార్జీల వివరాలు:
ఉచిత పరిమితి అంటే నెలకు రూ. లక్ష దాటిన తర్వాత జరిగే లావాదేవీల పైనే ఛార్జీల భారం:
* ప్రస్తుతం ఉన్న ఛార్జీ: ప్రతి రూ.1,000 కి రూ. 3.50 (కనీస ఛార్జీ రూ.150).
* కొత్తగా సవరించిన ఛార్జీ: ప్రతి రూ.1,000 కి రూ. 4 (కనీస ఛార్జీ రూ.150).
ఉదాహరణకు.. ఉచిత పరిమితి దాటి రూ.లక్షా ఒక వెయ్యి ట్రాన్సాక్షన్ చేస్తే దానిపై నేరుగా రూ.150 ఛార్జీ పడుతుంది. అలాగే రూ.లక్షా 38వేల లావాదేవీపై కొత్త నిబంధనల ప్రకారం రూ. 152 ఛార్జీ వసూలు చేస్తారు. ఈ నిబంధనలు బ్యాంక్ బ్రాంచ్‌లలో చేసే క్యాష్ లావాదేవీలతో పాటు క్యాష్ రీసైక్లర్ మెషిన్ల ద్వారా చేసే డిపాజిట్లకు కూడా వర్తిస్తాయి.
ALSO READ : 15 కిమీ రైడ్‌కి రూ.15వందలు ఏంటి సామీ?
ఎవరికి వర్తించదు?
బ్యాంక్ అందించే నెలవారీ ఉచిత లావాదేవీలు, రూ. లక్ష పరిమితి లోపే లావాదేవీలు నిర్వహించే సాధారణ కస్టమర్లపై ఈ ఛార్జీల పెంపు ఎలాంటి ప్రభావం చూపదు. కేవలం భారీ మొత్తంలో నగదు డిపాజిట్లు, విత్డ్రాల్స్ చేసేవారే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
