న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో వెండి దిగుమతులపై ఆంక్షలు విధించింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) శనివారం (మే 16) ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది.
వాణిజ్య మంత్రిత్వ శాఖ సవరించిన వెండి దిగుమతి పాలసీ ప్రకారం.. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన సిల్వర్ కడ్డీలను స్వేచ్ఛా వర్గం నుంచి నియంత్రిత వర్గానికి మార్చారు. ఇతర నిర్దిష్ట వెండి కడ్డీలను కూడా నియంత్రిత దిగుమతి వర్గానికి ఛేంజ్ చేశారు. నియంత్రిత వర్గంలోని వెండి దిగుమతి చేసుకోవాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో వెండి దిగుమతుల పర్యవేక్షణ, నియంత్రణను పటిష్టం చేయడానికే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇటీవలే బంగారం దిగుమతులపై సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం 15 శాతం పెంచిన విషయం తెలిసిందే. తాజాగా వెండి దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించడం గమనార్హం. భారతీయులు ఎవరూ కూడా ఏడాది పాటు బంగారం కొనవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దేశ ఆర్థిక ప్రయోజనాలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువను పరిరక్షించడం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్‌తో అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి సమయాల్లో దేశంలో ఉన్న డాలర్ల నిల్వలను కాపాడుకోవడం దేశ ఆర్థిక భద్రతకు ఎంతో కీలకం. బంగారం కోసం మనం డాలర్ల రూపంలో భారీగా చెల్లింపులు చేయడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలహీనపడుతుంది. సో.. బంగారం, వెండి దిగుమతులు ఆపేస్తే విదేశీ మారక నిల్వులు పడిపోకుండా రూపాయి విలువ స్థిరంగా ఉంటుంది. ఇందులో భాగంగానే గోల్డ్, సిల్వర్ దిగుమతులపై సుంకాల పెంపు, ఆంక్షలు విధిస్తోంది కేంద్రం.
