మార్కెట్‌లో అన్నింటి ధరలు పెరిగాయి. నిన్నటికి నిన్న లీటర్ పెట్రోల్, డీజిల్ 3 రూపాయలు పెరిగింది. దీనికితోడు సిటీలో ట్రాఫిక్ జామ్స్.. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసరంగా.. చాలా అర్జంట్‌గా కనీస ధరలు పెంచాలని.. ఉబర్, ర్యాపిడో, ఓలా బైక్ రైడర్స్ డిమాండ్ చేస్తున్నారు. కిలోమీటర్‌కు కనీస ఛార్జీ 20 రూపాయలు ఉండాలనే డిమాండ్‌తో.. దేశ వ్యాప్తంగా సమ్మెకు దిగుతున్నారు. ఇవాళ.. అంటే మే 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దేశ వ్యాప్తంగా ఉన్న కోటి 20 లక్షల మంది గిగ్ వర్కర్లు తమ సర్వీసులను బంద్ చేస్తున్నారు.
ఇప్పటికే గ్యాస్ నుంచి పెట్రోల్ రేట్ల వరకూ పెరిగిపోతున్న వేళ ఆ ప్రభావం నేరుగా రవాణా రంగంలో ఉన్న గిగ్ వర్కర్లకు మోయలేని భారంగా మారిందని గిగ్ వర్కర్ల యూనియన్ ప్రెసిడెంట్ సీమా సింగ్ అన్నారు. రోజువారీ వస్తువుల రేట్ల పెంపుతో బ్రతకం భారంగా మారుతోంటే కిలోమీటరు ప్రయాణానికి కనీసం ఛార్జీలను రూ.20కి పెంచాలని కంపెనీలతో పాటు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై వెంటనే స్పందించి నిర్ణయం తీసుకోకపోతే కోట్ల మంది గిగ్ వర్కర్లు ఈ రంగం నుంచి తప్పుకునే ప్రమాదం ఉందని అన్నారు.
రోజువారీ జీవనం కోసం ర్యాపిడో, ఓలా, ఉబెర్ పై ఆధారపడిన టూవీలర్ నడిపే గిగ్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారని నేషనల్ కోఆర్డినేటర్ నిర్మల్ గోరన అన్నారు. ఇప్పటికే వాహన మెయింటెనెన్స్ ఖర్చులు పెరగగా వాటికి అదనంగా పెట్రోల్ రేట్ల బాదుడు తోడవటంతో పేమెంట్ రేట్లు పెంచాల్సిందేనని పిలుపునిచ్చారు. అగ్రిగేటింగ్ కంపెనీలు దీనిపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు.
మండుతున్న ఎండల్లో హెవీ ట్రాఫిక్ ఉన్నప్పటికీ రోజుకు 10 గంటల నుంచి 14 గంటల పాటు పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు మరింతగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గోరన అన్నారు. చదువుకుంటూ పార్ట్ టైమ్ గా రైడింగ్ చేస్తున్న యూత్ నుంచి ఉద్యోగాలు లేక దీనినే ఫుల్ టైం డ్యూటీగా మార్చుకున్న సామాన్యుడి వరకూ దాదాపు 60 కోట్ల మంది దేశంలో ఏదో ఒక రూపంలో డెలివరీ గిగ్ వర్కర్లుగా దేశంలో పనిచేస్తున్నారని.. వీరందరిపై భారం తగ్గించి న్యాయమైన పేమెంట్స్ దక్కాలని యూనియన్ లీడర్స్ కోరుతున్నారు. కనీసం రూ.20 పెడితేనే కానీ టీ కూడా రాని రోజుల్లో ఇంకా తక్కువ ధరలకు రైడర్లను తిప్పటం సరికాదని వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
