అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనాలో జరిపిన రెండు రోజుల పర్యటన ఎలాంటి భారీ ఒప్పందాలు లేకుండానే ముగిసింది. ట్రేడ్, రేర్ ఎర్త్స్ వంటి కీలక అంశాలపై గట్టి హామీలు సాధించాలనే పెద్ద ఆశలతో బీజింగ్ వెళ్లిన ట్రంప్‌కు.. కేవలం సోయాబీన్స్, బోయింగ్ విమానాలకు సంబంధించిన ఒప్పందాలు మినహా ఆశించిన ఫలితాలు దక్కలేదు. అయితే ఈ పర్యటన ముగింపులో అమెరికా ప్రతినిధి బృందం వ్యవహరించిన తీరు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. చైనా అధికారులు తమకు బహుమతిగా ఇచ్చిన ప్రతి వస్తువునూ ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కే ముందు మెట్ల వద్దే ఉన్న డస్ట్‌బిన్‌లో పడేసి ట్రంప్ టీమ్ ఖాళీ చేతులతో వాషింగ్టన్ తిరుగుపయనమైంది.
వైట్ హౌస్ సిబ్బంది, అమెరికన్ జర్నలిస్టులతో కూడిన ట్రంప్ టీమ్.. చైనా ఇచ్చిన బర్నర్ ఫోన్లు, లాపెల్ బ్యాడ్జీలు, ప్రెస్ ఇన్వైట్స్, గిఫ్ట్స్ తో సహా అన్నింటినీ చెత్తబుట్టలో పారేసింది. చైనా నిఘా, గూఢచర్య వలయం నుంచి రక్షణ పొందేందుకే భద్రతా ప్రోటోకాల్ ప్రకారం ఇలా చేసినట్లు తేలింది. చైనా ఇటువంటి పద్ధతులకు పాల్పడుతుందనే ఆరోపణలు కొత్తేమీ కాదు. గతంలో బీజింగ్‌లోని బ్రిటీష్ ఎంబసీ సిబ్బందికి బహుమతిగా ఇచ్చిన టీపాట్‌లో కూడా నిఘా పరికరాన్ని కనుగొన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ పర్యటనలో ట్రంప్‌తో పాటు ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్, ఎలాన్ మస్క్ కూడా పాల్గొన్నారు. హ్యాకింగ్ బారిన పడకుండా ఉండటానికి వీరంతా తమ వ్యక్తిగత ఫోన్లను ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలోనే సిగ్నల్స్ బ్లాక్ చేసే ఫారడే బ్యాగులలో ఉంచి.. పర్యటన అంతటా కేవలం బర్నర్ ఫోన్లనే వాడారు.
పైకి ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఎంతో స్నేహపూర్వకంగా కనిపించినప్పటికీ.. తెరవెనుక తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. బీజింగ్‌లోని టెంపుల్ ఆఫ్ హెవెన్ సందర్శన సమయంలో తుపాకీ కలిగి ఉన్న అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌ను చైనా అధికారులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య చిన్న ఘర్షణలు జరిగాయి. అలాగే ద్వైపాక్షిక సమావేశానికి ముందు చైనా రిపోర్టర్ల తొక్కిసలాటలో వైట్ హౌస్ అధికారి ఒకరు గాయపడ్డారు. ఈ గందరగోళ పరిస్థితులపై అమెరికా ప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫైనల్ గా ఎలాంటి పెద్ద రాజకీయ ప్రయోజనాలు నెరవేరకపోయినప్పటికీ, ట్రంప్ చైనా పర్యటన ఇరుదేశాల మధ్య ఉన్న అపనమ్మకాన్ని, భద్రతాపరమైన ఆందోళనలను మరోసారి స్పష్టంగా బయటపెట్టింది.
