ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ 'రైడింగ్'.. గుజరాత్‌పై 29 పరుగుల తేడాతో మాస్ విక్టరీ

ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ 'రైడింగ్'.. గుజరాత్‌పై 29 పరుగుల తేడాతో మాస్ విక్టరీ

KKR vs GT: ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ స్టేజ్ ముగింపునకు పలికేందుకు సమయం దగ్గర పడుతున్న వేళ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అద్భుత ప్రదర్శనతో దుమ్మురేపింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ టైటాన్స్ (GT)తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో కేకేఆర్ 29 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసుకుంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించారు. 

కేకేఆర్ విధ్వంసం: 
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 247 పరుగుల స్కోరు చేసింది. ఓపెనర్ ఫిన్ అలెన్ (93 పరుగులు) సెంచరీ మిస్ అయినప్పటికీ.. అంగ్క్రిష్ రఘువంశీ, ఆల్‌రౌండర్ కెమెరాన్ గ్రీన్ పవర్ హిట్టింగ్‌తో గుజరాత్ బౌలర్లను క్లీన్‌గా ఉతికేసి భారీ టార్గెట్‌ని పెట్టారు. 

చేజింగ్‌లో గుజరాత్‌కు షాక్: 
248 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే రన్ చేజ్ సజావుగా సాగుతున్న సమయంలో గుజరాత్‌కు ఊహించని ట్విస్ట్‌లు ఎదురయ్యాయి: అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఓపెనర్ సాయి సుదర్శన్ బ్యాటింగ్ చేస్తూ హఠాత్తుగా గాయపడటంతో రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. వన్ డౌన్‌లో బ్యాటింగ్ కి వచ్చిన నిశాంత్ సింధు (1) ఘోరంగా విఫలమయ్యాడు. సునీల్ నరైన్ వేసిన స్పిన్ మ్యాజిక్‌కు మనీష్ పాండే చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు.

కెప్టెన్ గిల్ ఒంటరి పోరాటం: 
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాత్రం క్లాస్ ఇన్నింగ్స్‌తో కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఒంటరి పోరాటం చేస్తూ సెంచరీ వైపు దూసుకెళ్తున్న గిల్‌ను మళ్లీ సునీల్ నరైన్ మరోసారి దెబ్బకొట్టాడు. నరైన్ బౌలింగ్‌లో గిల్ ఆడిన భారీ షాట్‌ను బౌండరీ లైన్ వద్ద అనుకుల్ రాయ్ అద్భుతంగా క్యాచ్‌ అందుకోవడంతో గుజరాత్ ఆశలు దెబ్బతిన్నాయి.

బట్లర్ హాఫ్ సెంచరీ.. సుదర్శన్ తిరిగొచ్చినా తప్పని ఓటమి: 
మరోవైపు స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ సైతం క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించి వేగంగా అర్ధ శతకాన్ని కంప్లీట్ చేసుకున్నాడు. అయితే హాఫ్ సెంచరీ తర్వాత సౌరభ్ దూబే బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రమన్‌దీప్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత గాయం నుంచి కోలుకుని ఓపెనర్ సాయి సుదర్శన్ మళ్లీ క్రీజులోకి వచ్చి కేకేఆర్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. హాఫ్ సెంచరీ చేసినప్పటికీ జట్టుని మాత్రం గెలిపించలేకపోయాడు. అప్పటికే రన్ రేట్ బాగా పెరిగిపోవడంతో గుజరాత్ టైటాన్స్‌ 29 పరుగుల తేడాతో ఓడిపోయింది. 

కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం: 
ఈ సెన్సేషనల్ విజయంతో కోల్‌కతా నైట్ రైడర్స్ పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవడమే కాకుండా, ప్లేఆఫ్స్ రేసులో తమ ఆశలను పదిలం చేసుకుంది. కీలక సమయంలో సునీల్ నరైన్ వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పగా, కేకేఆర్ బ్యాటర్ల అగ్రెసివ్ మైండ్‌సెట్ జట్టుకు విజయాన్ని అందించింది.