అర్ధరాత్రి నడిరోడ్డుపై పావలా శ్యామల.. కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర వదిలివెళ్లిన క్యాబ్ డ్రైవర్ !

అర్ధరాత్రి నడిరోడ్డుపై పావలా శ్యామల.. కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర వదిలివెళ్లిన క్యాబ్ డ్రైవర్ !

పావలా శ్యామల. తనదైన యాస, విలక్షణ నటనతో తెలుగు తెరపై నవ్వులు పూయించిన సీనియర్ నటి పావలా శ్యామల అనారోగ్యంతో బాధపడుతుంది. ఆమె అర్ధరాత్రి నడిరోడ్డుపై దీన స్థితిలో హైదరాబాద్లో కనిపించింది. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న పావలా శ్యామల శుక్రవారం రాత్రి కూకట్పల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్లింది.

అయితే ఆమె దగ్గర అడ్మిట్ అవడానికి సరిపడా డబ్బులు లేవని సదరు హాస్పిటల్ వైద్యం అందించేందుకు నిరాకరించింది. ఆసుపత్రిలో వైద్యం అందించేందుకు నిరాకరించడంతో.. ఆమెను క్యాబ్ డ్రైవర్ కూకట్ పల్లి వై జంక్షన్ దగ్గర ఫుట్ పాత్ మీద వదిలేసి వెళ్లిపోయాడు. రోడ్డుపై ఆమె తన కూతురితో కలిసి బిక్కుబిక్కుమంటూ గడిపింది.

రోడ్డుపై వెళుతున్న కొందరు ఆమెను పావలా శ్యామల అని గుర్తించి.. ఆమె దీన స్థితి గురించి పోలీసులకు వివరించారు. పోలీసులు మరో స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఆమెను సనత్ నగర్లోని ఒక హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. క్యాబ్ డ్రైవర్ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అర్ధరాత్రి సమయంలో అనారోగ్యంతో ఉన్న వృద్ధురాలిని అలా నడి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోవడానికి అతనికి మనసెలా వచ్చిందని నెటిజన్లు క్యాబ్ డ్రైవర్పై మండిపడ్డారు.

వయోభారం, తీవ్ర అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సీనియర్ నటి పావలా శ్యామలకు సినీ హీరో అల్లు అర్జున్ అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్న సంగతి తెలిసిందే. తిరుమలగిరిలోని ఓ స్వచ్ఛంద సంస్థ ఆశ్రయంలో తన కుమార్తెతో కలిసి పావలా శ్యామల ఉంటుంది. వారి వైద్యం, నిత్యావసర ఖర్చుల కోసం ప్రతి నెలా రూ. 10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందేలా ఏర్పాట్లు చేశారు. గతంలో పలువురు ఆమెకు సహాయం చేసినప్పటికీ అనారోగ్యం కారణంగా పరిస్థితి మరింత క్షీణించడంతో ప్రస్తుతం ఆమె ఆశ్రయంలో తలదాచుకుంటున్నారు.