హైదరాబాద్: బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. మధ్య తరగతి కుటుంబాలకు తులం బంగారం కొనాలంటేనే తలకు మించిన భారంగా మారింది. అలాంటి.. ఈరోజుల్లో ఒంటి నిండా నగలు దిగేసుకుని.. కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతులతో గోల్డ్ మ్యాన్గా సూర్యా భాయ్ అనే వ్యక్తి పాపులర్ అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన ఈ సూర్యా భాయ్ ఈ మధ్య తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపల మీడియాకు ఒంటి నిండా బంగారంతో కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం.
అంత బంగారం ఒంటి మీద కనిపించే సరికి.. అతనితో ఫొటోలు దిగేందుకు భక్తులు కొందరు ఆసక్తి చూపించారు. ఇతనిని కిడ్నాప్ చేస్తే లైఫ్ సెటిలైపోతుందని కొందరు ఛలోక్తులు విసిరారు. కానీ.. ఇక్కడే అందరూ పప్పులో కాలేశారు. అసలు అతని ఒంటి మీద ఉంది బంగారమే కాదు. మెరిసేదంతా బంగారం కాదని పెద్దలు చెప్పినట్లు.. మనోడి ఒంటి మీద మెరుస్తుందంతా బంగారం కాదని తేలింది. ఒంటి మీద ఉందంతా రోల్డ్ గోల్డ్ నగలేనని అతనే చెప్పాడు. ఈ గోల్డ్ మ్యాన్.. కాదు కాదు.. ఈ ఫేక్ గోల్డ్ మ్యాన్ అసలు పేరు పల్లాపు సురేష్ కుమార్. హైదరాబాద్ ఐటీ అధికారులు అతని బండారం బయటపెట్టారు.
ఈ విషయం ఎలా బయటపడిందంటే.. 2 కిలోల బంగారం తీసుకువెళ్తున్నందుకు కొండా విజయ్ కుమార్ అలియాస్ 'బంగారు బాబు' అనే వ్యక్తిని ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అధికారులు రూ. 2.3 కోట్ల విలువైన 1.4 కిలోల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కొండా విజయ్ కుమార్ కేసు దర్యాప్తులో భాగంగా.. అత్తాపూర్‌కు చెందిన 37 ఏళ్ల సూర్యా భాయ్‌ని కూడా అధికారులు విచారించారు.
►ALSO READ | కౌశిక్రెడ్డి ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే తట్టుకోలేకపోతున్నారు: హరీష్ రావు
మార్చి 27న శుక్రవారం నాడు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. విచారణకు కూడా కోటి రూపాయల విలువైన 12 బంగారు ఆభరణాలు ధరించి కనిపించి, వాటిని ధరించానని చెప్పుకున్నాడు. అధికారులు విచారణలో అసలు నిజం బయటపడింది. ఆ ఆభరణాలు రోడియం పూత పూసిన రాగితో చేసిన నకిలీవని ఈ సూర్యా భాయ్ ఒప్పుకున్నాడు.
దీంతో.. వాటి అసలు విలువ రూ. 3 లక్షలు అని అధికారులు గుర్తించారు. నిజమైన బంగారం అని చెప్పుకుని.. ఈ నగలను ధరించి యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ పాపులర్ అయిన సూర్యా భాయ్ అసలు బిజినెస్ చికెన్ షాప్. చికెన్ షాప్తో పాటు జిమ్ ట్రైనర్గా వచ్చిన డబ్బుతో నెలకు రూ.20 వేలు అద్దె కడుతూ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు.
ప్రమోషన్స్, యూట్యూబ్ ఇంటర్వ్యూలతో పాటు అడపాదడపా చిన్న సినిమాల్లో నటించి బానే కూడబెట్టాడు. ఈ సూర్యా భాయ్ ఆరేళ్లుగా ఐటీ రిటర్న్ దాఖలు చేయలేదు. అతని దగ్గర థార్, సఫారీ, ఎండీవర్, బుల్లెట్ మోటార్ బైక్ ఉన్నాయని అధికారులు తెలిపారు. ల్యాండ్ సెటిల్మెంట్స్ చేస్తూ అలా వచ్చిన కమీషన్లతో వాటిని కొన్నాడని అధికారులు తేల్చారు.
