బడి ఎగ్గొట్టి వీధుల్లోకి: వాతావరణ మార్పులపై విద్యార్థుల ధర్నా

బడి ఎగ్గొట్టి వీధుల్లోకి: వాతావరణ మార్పులపై విద్యార్థుల ధర్నా

వాతావరణ మార్పుపై చేద్దాం.. చూద్దాం.. అనే నాన్చుడి ధోరణి పనికి రాదంటూ ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది పిల్లలు రోడ్డెక్కబోతున్నారు. శుక్రవారం బడులకు డుమ్మా కొట్టేసి, వీధుల్లో ప్లకార్డులతో తిరగనున్నారు. కొద్ది నెలలుగా సోషల్ మీడియా వేదికగా #ఫ్రై డేస్ఫర్ ఫ్యూ మూవ్ మెంట్ హ్యాష్ ట్యాగ్‌‌తో వాతావరణ మార్పు పరిణామాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందరం కలిసి మాట్లాడుకుని వాతావరణాన్ని, పీల్చే గాలిని బాగు చేసుకుందామనే పెద్దల ప్రతిపాదనలు (కాప్ సదస్సులు తదితరాలు) పేపర్లకే పరిమితమవుతున్నాయని చెబుతూ.. పెద్దలు ఫెయిల్‌‌ అవుతున్న చోటే చిన్నవాళ్లమైన తాము కలుగజేసుకోవాలని నిర్ణయించారు. అదే వాతావరణ మార్పులపై ప్రపంచం సమ్మె. ఇండియా నుంచీ విద్యార్థులు ఆ ధర్నాలో పాల్గొనబోతున్నారు. దాదాపు 90 దేశాల్లోని 1200 నగరాల్లో స్టూడెంట్స్ గ్లో బల్ క్లైమేట్ స్ట్రైక్‌‌లో పాల్గొంటారు. బెంగళూరు, హైదరాబాద్, గురుగ్రామ్, భావ్ నగర్, అంబికాపూర్, ఉదయ్ పూర్ తదితర నగరాలకు చెందిన స్టూడెంట్స్ స్ట్రైక్స్ లో పాల్గొనబోతున్నారు. 2018 ఆగస్టులో గ్రెటా థన్ బెర్గ్ అనే పదహారేళ్ల పర్యావరణ కార్యకర్త ప్రతి శుక్రవారం బడికి బంక్ కొట్టడం మొదలుపెట్టింది. స్వీడన్‌‌ పార్లమెంట్‌‌ ముందూ బైఠాయించింది.