గ్రేటర్ బెట్: ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తయ్.. రూ. 2 వేల నుంచి రూ. 10 లక్షల దాకా బెట్టింగ్

గ్రేటర్ బెట్: ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తయ్.. రూ. 2 వేల నుంచి రూ. 10 లక్షల దాకా బెట్టింగ్

గ్రేటర్ బెట్టింగ్

ఎవరు గెలుస్తరు.. ఎన్ని సీట్లొస్తయ్.. మేయరెవరు?

ఎలక్షన్లపై జోరుగా షరతులు కడుతున్రు

రూ. 2 వేల నుంచి రూ. 10 లక్షల వరకు బెట్​

హైదరాబాద్‌, వెలుగు: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రచారం ఆఖరి దశకు చేరుకుంది. నేతల మాటలు తూటాల్లా పేలుతున్నాయి. అందరిలోనూ ఎవరు గెలుస్తారో అనే ఆసక్తి నెలకొంది. ఎక్కడ చూసినా ఎన్నికల సందడే కనిపిస్తోంది. ఎన్నికలపై గుట్టుచప్పుడు కాకుండా జోరుగా బెట్టింగ్‌లు సైతం కాస్తున్నారు. లక్షలు, కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. పోలింగ్‌ తర్వాత, ఫలితాల ముందు బెట్టింగ్‌ మరింత ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి.

మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా..

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఒక్క గ్రేటర్ పరిధిలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పందేలు కాస్తున్నారు. ఏపీ–తెలంగాణ సరిహద్దు జిల్లాల్లోనూ బెట్టింగ్‌ కొనసాగుతోంది. బెట్టింగ్ వివిధ మార్గాల్లో నడుస్తోంది. కొందరు రహస్యంగా గ్రూపులుగా ఏర్పడి పందెం కాస్తున్నారు. మరికొందరు ఫాంహౌస్‌లు, హోటళ్లలో నడిపిస్తున్నారు. ఇంకొందరు తమ సర్కిళ్లలో ఫోన్ల ద్వారా కొనసాగిస్తున్నారు. ఫోన్ల ద్వారానే కాకుండా వాట్సప్‌, టెలిగ్రామ్‌ వంటి వాటిలో సీక్రెట్‌గా గ్రూపులు పెట్టి నడిపిస్తున్నారు. మరికొందరు ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ కాస్తున్నారు. ప్రత్యేకంగా కోడ్‌ భాషను ఉపయోగిస్తున్నారు. ఇక బెట్టింగ్ కోసం ప్రత్యేక యాప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. టెక్నాలజీ పెరిగిపోవడంతో ఫోన్ పే, గూగుల్ పే తదితర యూపీఐ ట్రాన్సాక్షన్లు చేస్తున్నారు.

లెక్కలన్నీ తీశాకే..

ఎన్నికలకు సంబంధించి వివిధ అంశాలపై బెట్టింగ్‌ కాస్తున్నారు. ఇందుకోసం ముందే అన్ని లెక్కలు తీస్తున్నారు. ముఖ్యంగా బరిలో దిగిన అభ్యర్థి ఏ సామాజిక వర్గానికి చెందినవాడు, ఆ వ్యక్తి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎన్ని ఉన్నాయి, గతంలో అక్కడి నుంచి విజయం సాధించిన క్యాండిడేట్​ఎవరు, ఎన్ని ఓట్లతో గెలిచారు, సర్వేలు ఏం చెబుతున్నాయి, గ్రౌండ్‌ లెవల్‌లో జనం ఏమనుకుంటున్నారు, ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయా, సిట్టింగ్‌లపై ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అనే విషయాలపై ఆరా తీసిన తర్వాతే బెట్టింగ్​కు దిగుతున్నారు. ఇక గ్రేటర్‌లో ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుంది, రెండో ప్లేస్‌లో ఏ పార్టీ  ఉంటుంది తదితర అంశాలపైనా బెట్టింగ్‌లు కాస్తున్నారు.

రెండు వేల నుంచి స్టార్ట్‌

ప్రస్తుతం రూ. 2 వేల నుంచి మొదలుకొని రూ. 10 లక్షల వరకు బెట్టింగ్‌ కడుతున్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండటంతో ఎక్కువ మంది ఆ పార్టీపైనే బెట్టింగ్‌కు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. అయితే ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలవడంతో బీజేపీ ఊపు మీద ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీపై అంతటా హైప్‌ పెరిగింది. దీంతో బీజేపీపై కూడా పెద్ద సంఖ్యలో పందెం కాస్తున్నారు. ఆ తర్వాత ఎంఐఎం మేయర్‌ అవుతారనే ప్రచారంతో దానిపై కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కాంగ్రెస్‌పై అంతంత మాత్రంగానే బెట్‌ కడుతున్నారు.

వీటిపైనే ఎక్కువగా..

100 డివిజన్లలో గెలుస్తామని టీఆర్‌ఎస్‌ నేతలు ప్రకటించారు. అయితే గెలుస్తుందని కొందరు.. గెలవదని మరికొందరు బెట్‌ కాస్తున్నారు. గెలవకపోతే మూడింతలు ఇచ్చేట్లుగా పందెం కాస్తున్నారు.

మేయర్‌ పీఠాన్ని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటుందని కొందరు.. కాదు ఎంఐఎం గెలుస్తుందని మరికొందరు బెట్‌ కాస్తున్నారు.

ఎన్నికల్లో బీజేపీ 80 సీట్లు క్రాస్‌ చేస్తుందని కూడా బెట్‌ కడుతున్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఫలానా డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ గెలిస్తే వెయ్యికి పది వేలు ఆఫర్‌ చేస్తున్నారు.

మేయర్‌ పదవిని బీజేపీ దక్కించుకుంటుందని కూడా పెద్ద ఎత్తున బెట్‌ కాస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ రెండో స్థానంలో నిలిస్తే బెట్‌కు పదింతలు అంటున్నారు.

టీఆర్‌ఎస్‌ గెలిస్తే మేయర్ పదవి ఫలానా వ్యక్తి అని కూడా పందెం కాస్తున్నారు.

జేబులు గుల్ల

ఎన్నికలే అదనుగా భావించిన బెట్టింగ్ ముఠాలు అమాయకులను ఉసిగొల్పుతున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలకు ఆశ చూపి బెట్టింగ్‌లోకి దింపుతున్నాయి. ఈజీ మనీకి అలవాటుపడిన యువకులు ఈ బెట్టింగ్ వైపు ఎక్కువగా మొగ్గుచూపి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఎక్కువ డబ్బు వస్తుందనే ఆశతో కొద్దిమంది అప్పులు చేసి మరీ బెట్టింగ్‌ కడుతున్నారు. డబ్బులు లేకుంటే ఖాళీ ప్రామిసరీ నోట్‌పై సంతకం లేదా బైక్స్‌, మొబైల్స్‌ పెట్టుకుని రూ.10 మిత్తితో బెట్టింగ్‌ నిర్వాహకులే డబ్బులు ఇస్తున్నారు.  ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

For More News..

రోడ్లు.. ట్రాఫిక్.. పొల్యూషన్​.. ఇవే మేజర్ ప్రాబమ్స్

బీజేపీ క్యాండిడేట్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి!

ఎల్​ఆర్​ఎస్​ స్పీడ్​.. గ్రేటర్​ ప్రజలపైనే రూ. 2 వేల కోట్లకుపైగా భారం

ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌‌.. అప్పులు తీర్చేందుకు తల్లి, చెల్లి హత్య?