కరోనా స్కామ్‌పై ఆరోపణలు నిరాధారమైతే నన్ను ఉరి తీయండి

కరోనా స్కామ్‌పై ఆరోపణలు నిరాధారమైతే నన్ను ఉరి తీయండి

కర్నాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ వ్యాఖ్య
బెంగళూరు: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌‌కు బీజేపీ నోటీసులు అందజేసింది. కరోనా పేషెంట్స్‌కు ట్రీట్‌మెంట్‌ విషయంలో వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, థర్మల్ స్కానర్లు, శానిటైజర్లు, గ్లవ్స్, మాస్కుల కొనుగోలులో రాష్ట్రంలోని అధికార బీజేపీ సర్కార్ రూ.2 వేల కోట్ల స్కామ్‌కు పాల్పడిందని సిద్ధరామయ్య, శివకుమార్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇరువురికీ నోటీసులు అందజేసిన బీజేపీ.. నిరాధార ఆరోపణలు చేసినందుక క్షమాపణలు చెప్పాలంది. దీనిపై డీకే శివ స్పందించారు.

బీజేపీ స్కామ్‌ను ప్రూవ్ చేసే అన్ని డాక్యుమెంట్‌లు తమ దగ్గర ఉన్నాయని కర్నాటక పీసీసీ ప్రెసిడెంట్ శివ కుమార్ అన్నారు. ఆయా డాక్యుమెంట్‌లను సమర్పించడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. అలాగే ఆయా కొనుగోళ్లకు సంబంధించి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశిస్తే ఆయా పత్రాలను తాము సమర్పిస్తామని స్పష్టం చేశారు. ‘ఒకవేళ నా ఆరోపణలు నిరాధారమైతే వాళ్లు నాపై కేసులు వేయొచ్చు.. నన్ను ఉరి తీయొచ్చు’ అని శివకుమార్ చెప్పారు.