తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్య తీసుకోవాలంటూ..

తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్య తీసుకోవాలంటూ..
  • తన ఇంటిముందే నిరసనకు దిగిన నేరెళ్ల బాధితుడు హరీష్

రాజన్న సిరిసిల్ల జిల్లా: నేరెళ్ల బాధితుడు హరీష్ వినూత్న నిరసనకు దిగాడు. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్య తీసుకోవాలంటూ తన ఇంటి ముందే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టాడు. దేశానికి స్వాతంత్రం వచ్చినా తమకు స్వాతంత్రం రాలేదని హరీష్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనను చిత్రహింసలకు గురిచేసి చంపేయాలని ప్రయత్నించిన పోలీసులపై ఇంత వరకు చర్యలు తీసుకోకపోతే స్వాతంత్ర్యం ఎక్కడుందని ప్రశ్నించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ తమ బతుకులు బందీ అయ్యాయని, కనీసం చనిపోవడానికి ఐనా అవకాశం ఇవ్వాలని ప్రధానమంత్రిని రాష్ట్రపతిని కోరుతున్నామని హరీష్ కంటతడిపెట్టుకుని విలపించారు. 
దళిత సామాజిక వర్గం వాడని చిన్న చూపు చూస్తున్నారు
‘‘నేరెళ్ల బాధితులమైన మాకు న్యాయం చేయాలి.. మాకు స్వాతంత్ర్యం కావాలి.. పోలీసులను వెంటనే శిక్షించాలి’’ అంటూ అట్టముక్కలపై నినాదాలు రాసి ప్రదర్శిస్తూ తన ఆవేదన తెలియజేసే ప్రయత్నం చేశాడు. ఈరోజు దేశమంతా స్వాతంత్ర్యం వచ్చిందని సంబరాలు జరుగుతున్నాయి గాని.. నేరెళ్ల సంఘటన జరిగి ఐదేళ్లు అవుతున్నా మాకు స్వాతంత్ర్యం రాలేదు. మాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోని ప్రభుత్వం తమకు ఎలాంటి న్యాయం చేయడం లేదన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వాడినని తనను చిన్న చూపు చూస్తున్నారని, తనను మానసికంగా.. శారీరకంగా హింసలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
న్యాయం చేయండి.. లేదంటే చనిపోయే అవకాశం కల్పించండి
నేరెళ్ల సంఘటన విషయంలో ప్రభుత్వం న్యాయం చేయడం లేదని హరీష్ ఆరోపించారు. స్వాతంత్ర్యం వచ్చిన రోజే తమపై పోలీసులు జులుం ప్రదర్శించి వేధింపులకు గురిచేశారని వాపోయాడు.. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ అయినా స్పందించి న్యాయం చేస్తారన్న నమ్మకం ఉంది, అందుకే మోడీ గారికి ఒకటే కోరుతున్నా.. నన్ను, నా కుటుంబానికి న్యాయం చేయండి.. లేదంటే స్వేచ్ఛగా చనిపోయే అవకాశం అయినా కల్పించమని కోరుతున్నానని హరీష్ తెలిపారు.
గత మార్చిలో హత్యాయత్నం నుంచి తప్పించుకున్న హరీష్
గత మార్చి నెల 29న రాత్రి నేరెళ్ల బాధితుడు కోల హరీశ్ ఇంటిమీదకు ఓ లారీ దూసుకెళ్లగా బండరాళ్లు అడ్డుగా ఉండడంవల్ల లారీ ఇంటిలోపలిదాకా రాకపోవడంతో  పెద్ద ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. ఈ ఘటన కలకలం రేపింది. తనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని అడిగితే మంత్రి కేటీఆర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, తనను హత్య చేసేందుకే లారీని తన ఇంటిమీదకు తోలారని బాధితుడు కోల హరీష్ ఆరోపించగా.. మద్దతుగా బీజేపీ ఆందోళనకు దిగింది. నెరేళ్లలోని రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డైలీ వందల సంఖ్యలో  ఇసుక లారీలు ఓవర్ లోడుతో వెళ్తుంటే జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని, మంత్రి కేటీఆర్ అండ, ఆఫీసర్ల కనుసన్నల్లో అక్రమ దందా కొనసాగుతోందని బాధితులు ఆరోపించారు. తాజాగా హరీష్ వినూత్న నిరసనతో మరోసారి నేరెళ్ల వ్యవహారం చర్చనీయాంశం అయింది.