కెరీర్ పూర్తయ్యేసరికి అతడు గ్రేటెస్ట్ బౌలర్‌‌గా మారుతాడు

కెరీర్ పూర్తయ్యేసరికి అతడు గ్రేటెస్ట్ బౌలర్‌‌గా మారుతాడు

మెల్‌‌బోర్న్: టీమిండియా కంగారూ గడ్డపై అడుగుపెట్టింది. భారీ సిరీస్‌‌కు అవసరమైన సన్నాహకాలను ప్రారంభించింది. ఆస్ట్రేలియాను మట్టికరిపించాలంటే ఇండియాకు ఫాస్ట్ బౌలింగ్ కీలకం కానుంది. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, నవ్‌‌దీప్ సైనీ, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ లాంటి బౌలర్లతో మన పేస్ విభాగం అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. టీమిండియా పేస్ బౌలింగ్ బలగంపై ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ జాసన్ గిలెస్పీ స్పందించాడు. ముఖ్యంగా బుమ్రా ఫ్యూచర్‌‌పై గిలెస్పీ కామెంట్స్ చేశాడు.

‘టీమిండియా బౌలర్లు తమ యాక్షన్, స్వింగ్, పేస్‌‌తో బౌలింగ్ అటాక్‌‌కు వైవిధ్యాన్ని తీసుకొచ్చారు. ఇండియా బౌలింగ్ చాలా బాగుంది. తన కెరీర్ పూర్తయ్యే సమయానికి బుమ్రా సూపర్‌‌స్టార్ అవుతాడు. మూడు ఫార్మాట్లలో టీమిండియాకు గ్రేటెస్ట్ బౌలర్‌‌గా అవతరిస్తాడు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. షమి అత్యద్భుత బౌలర్. ఇషాంత్ తన అనుభవాన్ని రంగరించి ఆడుతున్నాడు. అతడి కెరీర్‌‌లో ఎత్తుపల్లాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించాడు. తనను తాను మెరుగుపర్చుకోవడంపైనే దృష్టి సారిస్తున్నాడు. భువనేశ్వర్ కుమార్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అతడికి గాయమైంది. అయితే త్వరలో ఫిట్‌‌నెస్ సాధిస్తాడని ఆశిస్తున్నా. పేస్ దళానికి ఉమేశ్ యాదవ్ అదనపు వేగాన్ని జోడిస్తున్నాడు’ అని గిలెస్పీ పేర్కొన్నాడు.