ఆరు నెలల తర్వాత.. తెరుచుకున్న బద్రినాథ్ ఆలయం

ఆరు నెలల తర్వాత.. తెరుచుకున్న బద్రినాథ్ ఆలయం

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన బద్రినాథ్‌ ఆలయం ఆదివారం తెరుచుకుంది. పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో బద్రినాథ్‌ ఆలయం ఒకటి. చార్‌ ధామ్‌ యాత్ర శుక్రవారం నుంచే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేదార్‌నాథ్‌, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు భక్తుల కోసం శుక్రవారం రోజే తెరుచుకున్నాయి. వేసవిలో మాత్రమే ఈ ఆలయాలు తెరిచుకుంటాయి. వర్షాకాలం, శీతాకాలంలో మంచు కురుస్తూ ఉంటుంది కావున ఆ టైంలో గుడి మూసివేసి చార్‌ ధామ్‌ యాత్రలో భాగంగా భక్తుల కోసం తిరిగి తెరిచారు.

వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య ఆదివారం ఉదయం 6 గంటలకు ఆలయ ప్రధాన తలుపులను అధికారులు తెరిచారు. ఇండియన్ ఆర్మీ గ్రెనేడియర్‌ రెజిమెంట్‌ బ్యాండ్‌ భజన గీతాలను పాడారు. ప్రత్యేక పూలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో  భక్తులు తరలివచ్చారు. 
చార్‌ధామ్‌ యాత్రలో బద్రినాథ్‌ దేవాలయం సందర్శన భాగంగా ఉంటుంది. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు బద్రినాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే, శీతాకాలం సందర్భంగా ఈ ఆలయాన్ని మూసివేస్తారు. ఇక దాదాపు ఆరు నెలల పాటు మూసి ఉన్న ఈ ఆలయ తలుపులు భక్తుల దర్శనార్థం నేడు తెరుచుకున్నాయి. చలికాలం మూసివేసిన గర్వాల్‌ హిమాలయాల్లోని ఈ దేవాలయాలను అక్షయ తృతీయ సందర్భంగా తిరిగి తెరిచారు.