బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి..ఢిల్లీలో వీహెచ్ పీ నేతల నిరసనలు

బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి..ఢిల్లీలో వీహెచ్ పీ నేతల నిరసనలు

బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఢిల్లీలో విశ్వహిందూ పరిషత్ నేతలు ఆందోళనకు దిగారు. మంగళవారం ( డిసెంబర్ 23) ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషనరేట్ ముందు నిరసనలు వ్యక్తంచేశారు. బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుచేశారు. వీహెచ్ పీ నేతలు, కార్యకర్తలు  భారీ ఎత్తున రావడంతో పోలీసులు  అప్రమత్తమయ్యారు. వీహెచ్ పీ కార్యకర్తలను  అడ్డుకునేందుకు  పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. బారికేడ్లను తొసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ఆందోళనకారులు యత్నించారు. లాఠీ ఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు పోలీసులు. దీంతో బంగ్లా హైకమిషన్ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. 

గత వారం బంగ్లాదేశ్ లోని మైమెన్‌సింగ్‌లో బలుకా ప్రాంతంలో దైవదూషణ ఆరోపణలపై దీపు చంద్రదాస్ ను ఓ అల్లరి మూక కొట్టి చంపింది. గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న  దీపూను బయటికి లాగి కర్రలతో కొట్టి చంపి అనంతరం చెట్టుకు వేలాడదీసి తగలబెట్టారు. విద్యార్థినాయకుడు, హసీనా ప్రభుత్వం  కులదోసిన నిరసనల్లో కీలక సూత్రధారి అయిన షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్య తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన బంగ్లాదేశ్ లో పాటు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. ఆయా దేశాల్లో మైనార్టీల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. 

భారతదేశంలో నిరసనలు

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దారుణాలను ఖండిస్తూ డిసెంబర్ 22న హిందూ జాగరణ్ మంచ్, విశ్వ హిందూ పరిషత్ సంయుక్తంగా బంగ్లాదేశ్ వీసా దరఖాస్తు కేంద్రం వెలుపల ఆందోళనలు చేపట్టాయి. పొరుగు దేశంలోని మైనారిటీ వర్గాల భద్రతకు చర్య తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.  మంగళవారం కూడా ఆందోళలను ఉధృతం చేశాయి హిందూ సంఘాలు. 

బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన హింసాకాండపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు, ముఖ్యంగా ఇటీవలి రోజుల్లో హిందువులపై జరిగిన మూకదాడులకు ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుందన్నారు. బంగ్లాదేశ్  లో పౌరుల భద్రత ముఖ్యమన్నారు. ప్రతి పౌరుని భద్రత లక్ష్యంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. 

ALSO READ : బీజేపీ దగ్గర 6 వేల 900 కోట్లు.. కాంగ్రెస్ దగ్గర రూ.53 కోట్లు మాత్రమే..!