లక్నో: యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ ముగ్గురు అక్కాచెల్లెల డెత్ మిస్టరీ వీడింది. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఛేధించారు. తండ్రి ఫోన్లు లాక్కోని సోషల్ మీడియా వాడనివ్వకపోవడం.. ఆన్ గేమ్స్ ఆడనివ్వకపోవడంతో మనస్థాపానికి గురై ముగ్గురు అక్కాచెల్లెలు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
అసలేం జరిగిందంటే..?
ఆన్ లైన్ గేమ్స్ ఆడవద్దంటూ తల్లిదండ్రులు కట్టడి చేయడంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌లోని భారత్ సిటీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. భారత్ సిటీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో నివాసం ఉంటున్న దంపతులకు నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. కరోనా సమయంలో ఇంట్లోనే ఉండాల్సి రావడంతో వారికి ఆన్లైన్ గేమ్స్ ఆడటం అలవాటుగా మారింది.
ఆ తర్వాత కొరియన్ లవ్ గేమ్ వారికి వ్యసనంగా మారింది. ఇలా గేమ్స్ ఆడేందుకు తరచూ స్కూలుకు డుమ్మా కొట్టేవారు. పిల్లల తీరుతో విసిగిపోయిన పేరెంట్స్.. ఆన్ లైన్ గేమ్స్ ఆడవద్దని గట్టిగా హెచ్చరించారు. గేమ్స్ ఆడేందుకు వీలులేకుండా కట్టడి చేశారు. దీంతో మనస్తాపం చెందిన బాలికలు ముగ్గురూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున తాము ఉంటున్న బిల్డింగ్ పైకెక్కి తొమ్మిదో అంతస్తు నుంచి దూకారు. తీవ్ర గాయాలతో ముగ్గురూ అక్కడికక్కడే చనిపోయారు.
‘సారీ పప్పా..’ అంటూ లేఖ
బాలికలు ముగ్గురూ కొరియా కల్చర్‌పై విపరీతమైన అభిమానం పెంచుకున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. తమను తాము కొరియన్లుగా భావించుకున్నారు. ఆ పేర్లతోనే ఒకరినొకరు పిలుచుకునేవారు. మొబైల్ ఫోన్ వాడకుండా కట్టడి చేయడంతో ఒంటరితనం ఫీలై మానసికంగా కుంగిపోయారు. ఆపై ముగ్గురూ కలిసి తాము ఉంటున్న తొమ్మిదో అంతస్తు బాల్కనీ నుంచి దూకి చనిపోయారు.
ఈ ఆత్మహత్యల వెనక ఆన్ లైన్ గేమ్ పాత్ర ఉందని తొలుత అనుమానించిన పోలీసులు.. ప్రాథమిక విచారణ తర్వాత కొరియన్ లవ్ గేమ్ ప్రభావంతోనే ముగ్గురు బాలికలు సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. కాగా, చనిపోయే ముందు ఆ బాలికలు తమ తండ్రిని ఉద్దేశంచి ఓ పేపర్ సారీ పప్పా.. మా డైరీని చూడండి. అందులో రాసినవన్నీ నిజమేనని లేఖ రాశారు.
