హైదరాబాద్: బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ప్రధాని మోడీని చూసి బీజేపీకి ఓటేయాలని తెలంగాణ బీజేపీ నేతలు అంటున్నారు. ఎక్కడైనా పెళ్లి పెద్దను చూసి పిల్లను ఇస్తామా అని ఎద్దేవా చేశారు. బీజేపీకి ఓటేస్తే ఢిల్లీ నుంచి మోడీ వచ్చి సమస్యలు తీర్చుతారా అని ప్రశ్నించారు. మోడీని చూసి ఓటేస్తే ఇక్కడి బోడీలు పని చేయరని టీ బీజేపీ నేతలను విమర్శించారు. శనివారం (ఫిబ్రవరి 7) 'ప్రజా పాలన – ప్రగతి బాట' కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగి మండలం నారాయణపూర్‌లో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అనంతరం బహిరంగా సభలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నాయని ఆరోపించారు.
పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏనాడు ప్రజల సమస్యలు పరిష్కరించలేదన్నారు. నిజంగా కేసీఆర్ పని చేసి ఉంటే ఇవాళ ఓట్లు అడుక్కునే పరిస్థితి రాకపోవన్నారు. బీఆర్ఎస్కు ఎప్పుడూ ఓట్లే కావాలని కానీ ప్రజల సమస్యలు వద్దని విమర్శించారు. పదేండ్లు అధికారంలోకి ఉండి రంగారెడ్డి జిల్లాకు కేసీఆర్ గోదావరి జలాలు ఇవ్వలేదన్నారు. రంగారెడ్డి జిల్లాలకు గోదావరి జలాలు అందించేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌కు ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. గోదావరిలో ఏటా 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తాయని స్వయంగా కేసీఆరే అసెంబ్లీలో చెప్పారు.
ALSO READ : తెలంగాణ, మహారాష్ట్ర మధ్య నీటి గొడవలు లేవు
3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే కళ్లప్పగించి చూశారని విమర్శించారు. ప్రాణహిత ద్వారా 300 టీఎంసీలు ఇచ్చి ఉంటే రంగారెడ్డి జిల్లాకు తాగునీరు వచ్చేదన్నారు. రంగారెడ్డికి గోదావరి జాలలను ఎందుకు అడ్డుకున్నారని.. రంగారెడ్డి జిల్లా అభివ్రుద్ధి కోసమని కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో సబితా ఇంద్రారెడ్డి దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సబితా పార్టీ మారిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో ఏం డెవలప్మెంట్ జరిగిందని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్ట్ కడతామని కనీసం భూసేకరణ కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ ను కేసీఆర్ ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. త్వరలోనే లక్ష్మీదేవిపల్లి దగ్గర ప్రాజెక్ట్ కడతామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో లక్ష కోట్లతో కాళేశ్వరం కడితే మూడేండ్లోనే కూలేశ్వరం అయ్యిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో ఒకాయనకు జన్వాడలో ఫాం హౌస్ వచ్చిందని ఆరోపించారు. పదేండ్లు దోచుకున్న సొమ్ముతో పేపర్లు, టీవీలు పెట్టుకున్నారని ఆరోపించారు. పదేళ్లలో కనీసం రేషన్ కార్డ్ ఇవ్వాలనే ఆలోచన కూడా చేయలేదని నిప్పులు చెరిగారు.
ALSO READ : మున్సిపల్ ఎన్నికలు క్లీన్ స్వీప్ చేయబోతున్నం
గోదావరి జలాలను తీసుకొచ్చి తాండూరు, పరిగి, చేవెళ్లకు నీళ్లు ఇస్తామన్నారు. తాండూరుకు కాగ్నా నది నీళ్లు ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో దళితుల ఆత్మగౌరవం నిలబెట్టామన్నారు. మొఖం చెల్లక కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదని విమర్శించారు. రెండేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం. గత పాలకులు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలంతా ఆలోచించి ఓటేయాలని సూచించారు.
