మున్సిపల్ ఎన్నికలు క్లీన్ స్వీప్ చేయబోతున్నం: మంత్రి ఉత్తమ్

మున్సిపల్ ఎన్నికలు క్లీన్ స్వీప్ చేయబోతున్నం: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్: త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేయబోతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం (ఫిబ్రవరి 7) జగిత్యాల జిల్లాలో మంత్రి ఉత్తమ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 12 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు నామమాత్రపు నిధులే వచ్చాయని అన్నారు. 

2014 రాష్ట్ర విభజన హామీల నిధులు ఇప్పటివరకు రాలేదని.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజల్లో సానుకూల వాతావరణం ఉందన్నారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, ఫ్రీ బస్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు లాంటి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయని అన్నారు. 

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను అభివృద్ధి చేయడానికి మునుముందు వేల కోట్లతో ప్రతిపాదనలు చేయబోతున్నామని తెలిపారు. రాను రాను తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల్లో నివసించడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారన్నారు. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలను అభివృద్ధి చేయడానికి బడ్జెట్‎లో వేలకోట్లతో ప్రతిపాదనలు పెట్టి రోడ్లు, డ్రైనేజీలు, విద్య, వైద్యం లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తోందని చెప్పారు.