ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా మరోసారి లేఆఫ్స్ బాంబు పేల్చింది. సిలికాన్ వ్యాలీలోని తన కార్యాలయాల నుంచి మరో 102 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మెన్లో పార్క్‌లోని ప్రధాన కార్యాలయంతో పాటు శాన్ మాటియో కౌంటీలోని కార్పొరేట్ విభాగాల్లో ఈ కోతలు ఉండనున్నాయి. అయితే ఈ లేఆఫ్స్ వెనుక కంపెనీ ఒక వ్యూహాత్మక మార్పును స్పష్టం చేస్తోంది. ఇప్పటి వరకు భారీగా పెట్టుబడులు పెట్టిన 'మెటావర్స్' విభాగం నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుని.. వేరబుల్ టెక్నాలజీ వైపు మళ్లుతున్నట్లు మెటా ప్రతినిధి వెల్లడించారు.
వాస్తవానికి ఈ ఏడాది మెటా తన రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో 10 శాతం మేర కోతలు విధిస్తామని గతంలోనే చెప్పింది. తాజాగా జరుగుతున్న మార్పులు అందులో భాగమే. కేవలం మెన్లో పార్క్ విభాగంలోనే గత కొన్ని నెలల్లో 318 మందిని మెటా తొలగించింది. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే.. కంపెనీ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు. AI వాడకం పెరగడం వల్ల గతంలో ఒక టీమ్ చేసే పనిని ఇప్పుడు ఒక్క ఉద్యోగే చేయగలుగుతున్నారని అన్నారు. ఏఐ టూల్స్ కోసం మెటా ఏకంగా 115 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోంది. అంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఉద్యోగుల అవసరం తగ్గుతోందనేది స్పష్టమవుతోంది.
ALSO READ : ఆస్ట్రేలియాలోనూ అంబానీ దూకుడు..
సిలికాన్ వ్యాలీలో కేవలం మెటా మాత్రమే కాదు.. గూగుల్, అమెజాన్, సేల్స్‌ఫోర్స్, పిన్‌ట్రెస్ట్ వంటి దిగ్గజాలు కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి. రిపోర్ట్స్ ప్రకారం గతేడాది ఏఐ కారణంగా దాదాపు 55వేల మంది టెక్కీలు తమ ఉద్యోగాలను కోల్పోయారు. గూగుల్ 77 మందిని, అమెజాన్ 666 మందిని తమ వ్యాలీ ఆఫీసుల నుంచి తొలగించాయి. ఇవన్నీ ఏఐ ఆధారిత పునర్నిర్మాణంలో భాగంగా జరుగుతున్నవే.
టెక్కీల భవిష్యత్తు విషయానికి వస్తే.. కేవలం కోడింగ్ లేదా పాత నైపుణ్యాలతో ఇకపై నెట్టుకురావడం కష్టమని తాజా టెక్ లేఆఫ్స్ హెచ్చరిస్తున్నాయి. కంపెనీలు ఇప్పుడు ఏఐపై పట్టున్న వారి కోసం వెతుకుతున్నాయి. ఒకవైపు లేఆఫ్స్ జరుగుతున్నా.. మెటా తన ఉద్యోగుల సంఖ్యను 6 శాతం పెంచుకుని 78వేలకు చేర్చింది. అంటే కంపెనీలు ఉద్యోగాలను పూర్తిగా తీసేయడం లేదు.. కానీ పాత నైపుణ్యాలు ఉన్న వారి స్థానంలో ఏఐని సమర్థవంతంగా వాడగల కొత్త తరం ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటున్నాయి. సో లేటు చేయకుండా మనుగడకోసమైనా కొత్త ఏఐ టెక్నాలజీలకు ఉద్యోగులు స్కిల్ అప్ గ్రేడ్ చేసుకోవాల్సిన సమయం వచ్చేసిందని చెప్పుకోవచ్చు.
