హైదరాబాద్ హయత్ నగర్ దగ్గర విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు స్థానికులు. జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు పలు కాలనీవాసులు. గత కొన్ని రోజులుగా హయత్ నగర్ దగ్గర రోడ్డు దాటుతూ ప్రమాదాలు జరుగుతున్నాయని.. పలువురు మృతి చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన పలు కాలనీవాసులు రోడ్డు దాటడానికి వసతులు లేవని ఆందోళనకు దిగారు.
ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించి ప్రజల ప్రాణాలు రక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఆందోళకారులతో వాగ్వాదానికి దిగారు. కిలో మీటర్ల మేర జామ్ అయిన ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.
ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ దగ్గర రోడ్డు దాటుతుండగా డిసెంబర్ 15న ఓ యువతిని అతి వేగంతో వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐశ్వర్య అనే ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని మృతి చెందగా ఆమె తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే స్థానికులు ఆందోళనకు దిగారు.
