టాలీవుడ్ లో దుమారం రేపిన హీరోయిన్స్ 'వస్త్రధారణ వివాదం' ఎట్టకేలకు ఒక కీలక మలుపు తిరిగింది. నటుడు శివాజీ తన వివాదాస్పద వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలతో మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయని అంగీకరిస్తూ.. సారీ చెప్పారు. 'దండోరా' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఉద్దేశ పూర్వకంగా కామెంట్స్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా బహిరంగ క్షమాపణ కోరుతూ వీడియోను విడుదల చేశారు. అయితే, ఈ లోపే ఈ వ్యవహారం కాస్త తెలంగాణ మహిళా కమిషన్ వరకు వెళ్లింది. మహిళల వస్త్రధారణ పై చేసిన వ్యాఖ్యలకు సీరియస్ అయింది. ఈ వివాదస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరింది.
శివాజీ వీడియో వివరణలో..
'దండోరా' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల దుస్తులపై శివాజీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. ఒకవైపు పరిశ్రమకు చెందిన 'వాయిస్ ఆఫ్ ఉమెన్' బృందం, మరోవైపు రామ్ గోపాల్ వర్మ, మంచు మనోజ్ వంటి వారు తీవ్రంగా స్పందించడంతో శివాజీ దిగివచ్చారు. తన తప్పుపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. నిన్నటి ఈవెంట్‌లో హీరోయిన్లు పడుతున్న ఇబ్బందుల గురించి చెబుతూ, ఆవేశంలో రెండు అన్‌పార్లమెంటరీ పదాలు వాడాను. అది నా తప్పే, ఆ మాటలు అనకుండా ఉండాల్సింది అని సారీ చెప్పారు.
బహిరంగ క్షమాపణ కోరుతూ...
ఉద్దేశం మంచిదే కానీ..: "హీరోయిన్లు బయటికి వెళ్లినప్పుడు వారి గౌరవం పెరిగేలా దుస్తులు ఉంటే బాగుంటుందనేది నా ఆకాంక్ష. స్త్రీ అంటే మహాశక్తి, అమ్మవారితో సమానం అని నమ్మే వ్యక్తిని నేను. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం నాకు లేదు అని శివాజీ స్పష్టం చేశారు. స్త్రీలను తక్కువగా చూస్తున్న ఈ రోజుల్లో వారి భద్రత గురించి చెప్పాలనే ఆవేదనలో ఊరి భాష మాట్లాడాను. నా ఉద్దేశం మంచిదే అయినా, ఆ రెండు పదాలు దొర్లడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అని మహిళలందరికీ క్షమాపణలు చెప్పారు.
►ALSO READ | Voice of Women TFI: బేషరతు క్షమాపణ లేదంటే లీగల్ యాక్షన్.. శివాజీకి మహిళా సెలబ్రిటీల అల్టిమేటం!
రంగంలోకి మహిళా కమిషన్..
శివాజీ క్షమాపణలు చెప్పినప్పటికీ, అప్పటికే ఆయన వ్యాఖ్యలు చట్టపరమైన చిక్కుల్లోకి వెళ్లాయి. శివాజీ వాడిన "సామాన్లు కనబడేలా..", "దరిద్రపు ము..." వంటి పదజాలంపై తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే వారు ఎంతటి వారైనా సరే.. కఠిన చర్యలు తప్పవు. శివాజీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే న్యాయ సలహా తీసుకుంటున్నాం. దీనిపై కచ్చితంగా లీగల్ ప్రోసీడింగ్స్ ఉంటాయి అని ఆమె హెచ్చరించారు. బహిరంగ వేదికలపై మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని ఆమె స్పష్టం చేశారు. శివాజీ క్షమాపణ చెప్పడంతో ఈ వివాదానికి ప్రస్తుతానికి తెరపడినట్లు కనిపిస్తున్నా, మహిళా కమిషన్ తీసుకునే తదుపరి చర్యలపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
I sincerely apologise for my words during the Dhandoraa pre-release event last night.@itsmaatelugu pic.twitter.com/8zDPaClqWT
— Sivaji (@ActorSivaji) December 23, 2025
