మరోసారి దుబాయ్ ఎయిర్ పోర్టును టార్గెట్ చేసిన ఇరాన్.. డ్రోన్ దాడిలో ఇండియన్కు గాయాలు

మరోసారి దుబాయ్ ఎయిర్ పోర్టును టార్గెట్ చేసిన ఇరాన్.. డ్రోన్ దాడిలో ఇండియన్కు గాయాలు

ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం ఎంతకెంతకీ పెరుగుతూనే పోతుంది కానీ.. ఇప్పట్లో తగ్గుతుందనే సంకేతాలు కనపడటం లేదు. అమెరికా–ఇజ్రాయెల్ దాడులను అంతే వేగంగా తిప్పికొడుతూ ఇరాన్ సవాల్ విసురుతోంది. లేటెస్టుగా మరోసారి దుబాయ్ విమానాశ్రయాన్ని టార్గెట్ చేసింది. బుధవారం (మార్చి 11) డ్రోన్స్ తో అటాక్ చేయడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరు ఇండియన్ కూడా ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. 

యూఏఈపై డ్రోన్స్ తో విరుచుకుపడుతోంది ఇరాన్. దుబాయ్ ఎయిర్ పోర్టుకు సమీపంలో రెండు డ్రోన్స్ పేలినట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించింది. కానీ విమానాల రాకపోకలు సాధారణంగానే సాగుతున్నట్లు అధికారులు చెప్పారు. దుబాయ్ ఎయిర్ పోర్ట్ సమీపంలో పడిన రెండు మిస్సైళ్లతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురైనట్లు దుబాయ్ మీడియా ఆఫీస్ ప్రకటన వెలువరించింది.

దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్.. ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే విమానాశ్రయం. గత సంవత్సరం 10 కోట్ల మంది ప్రయాణికులు ఇక్కణ్నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. అలాంటి విమానాశ్రయంపై యుద్ధం ఆరంభంలోనే దాడులు చేసిన ఇరాన్.. మరోసారి టార్గెట్ చేయడం గమనార్హం. ఇక ఇరాన్ దాడుల క్రమంలో మిడిలీస్ట్ లోని చాలా ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడింది. మిస్సైల్స్, డ్రోన్స్ పడే అవకాశం ఉండటంతో మిడిల్ ఈస్టర్న్ ఎయిర్ స్పేసెస్ లలో కఠిన నిబంధనలు విధించారు. దీంతో విమానాలు క్యాన్సిల్ చేయడం, రీరూట్ చేయడం తప్పని పరిస్థితి. 

అంతేకాకుండా పడవలపైన కూడా దాడులు జరుగుతున్నట్లు మెరీటైమ్ సెక్యూరిటీ తెలిపారు. యూఏఈ కోస్టల్ ప్రాంతంలో యూకే (బ్రిటిష్​) మెరీటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ఆగిపోయినట్లు పేర్కొంది.  ఒమన్  సమీపంలో హార్మూజ్ జలసంధి మూత పడింది. ప్రపంచానికి 20 శాతం ఆయిల్ సప్లై ఈ జలసంధి నుంచే జరుగుతుంది.