ఎయిర్ ఇండియాకి తప్పిన ప్రమాదం: ఫ్లయిట్ ల్యాండింగ్ లో విరిగిన ముందు చక్రం!

ఎయిర్ ఇండియాకి తప్పిన ప్రమాదం: ఫ్లయిట్ ల్యాండింగ్ లో విరిగిన ముందు చక్రం!

థాయిలాండ్‌లోని ఫుకెట్ విమానాశ్రయంలో బుధవారం(మార్చ్ 11)న ఓ విమానానికి  ప్రమాదం తృటిలో తప్పింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఫుకెట్ లో ల్యాండ్ అవుతున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో  ఈ ఘటన చోటుచేసుకుంది. 

సమాచారం ప్రకారం... హైదరాబాద్ నుండి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం (IX 938) థాయిలాండ్‌లోని ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో హార్డ్ ల్యాండింగ్ అయ్యింది అంటే విమానం రన్‌వేపై బలంగా తాకుతూ దిగింది. ఈ కుదుపునకు విమానం ముందు భాగంలో ఉండే నోస్ గేర్ అంటే ముందు  చక్రం విరిగిపోయింది.

తప్పిన ప్రమాదం:
విమానం ముందు చక్రం రన్‌వేపై విరిగిపోయినట్లు  సోషల్ మీడియాలో వస్తున్న ఫోటోలు చూస్తే తెలుస్తుంది. అయితే, విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమై ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించేశారు. ఈ ప్రమాదం కారణంగా రన్‌వేను సాయంత్రం 6 గంటల వరకు మూసేసి, అధికారులు ఇతర విమానాలకు హెచ్చరికలు జారీ చేశారు.

ఎయిర్ ఇండియా స్పందన:
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి మాట్లాడుతూ... హైదరాబాద్ - ఫుకెట్ విమానం ముందు చక్రంలో సమస్య వచ్చిన మాట నిజమే. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు. ఫుకెట్ విమానాశ్రయ అధికారులు మాకు ఎంతో సహకరించారు అని తెలిపారు.

ఈ బోయింగ్ 737 మ్యాక్స్  8  విమానం ఉదయం ఈరోజు ఉదయం 6:42 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి, థాయిలాండ్ సమయం ప్రకారం ఉదయం 11:40 గంటలకు ఫుకెట్ చేరుకుంది. విమానం ల్యాండ్ అయ్యేటప్పుడు, టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ముందు భాగానికి ఈ నోస్ గేర్ చాలా కీలకం. అది విరిగిపోయినా ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.