గల్ఫ్ వార్ రెండోవారం కూడా కొనసాగుతున్న వేళ.. అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్, పాశ్చాత్య దేశాల మధ్య దశాబ్దాలుగా మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఖతార్.. ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఆ పాత్రను పోషించలేనని తెగేసి చెప్పింది. తమపై దాడులు జరుగుతున్న సమయంలో చర్చలకు మధ్యవర్తిగా ఉండటం సాధ్యం కాదని ఖతార్ స్పష్టం చేసింది.
ఖతార్ విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్-ఖులైఫీ తాజా ఇంటర్వ్యూలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. "మాపై దాడులు జరుగుతున్నప్పుడు మేము మధ్యవర్తిగా వ్యవహరించలేము. ఈ విషయాన్ని ఇరాన్ పాలకులు అర్థం చేసుకోవాలి" అని హెచ్చరించారు. ప్రాంతీయ దేశాలు ఇరాన్‌కు శత్రువులు కావని, కానీ ఇరాన్ ఆ కోణంలో ఆలోచించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పశ్చిమాసియాలో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ సైనిక చర్యలు.. ఇరాన్ జరుపుతున్న ప్రతీకార దాడుల వల్ల గల్ఫ్ దేశాలు అతలాకుతలమవుతున్నాయి. అమెరికా స్థావరాలతో పాటు యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాలలోని కీలక ఇంధన కేంద్రాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులకు దిగుతోంది. ఈ క్రమంలోనే ఖతార్ తన దౌత్యపరమైన సపోర్ట్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది.
►ALSO READ | బంగ్లాకు అండగా భారత్.. ఇంధన సంక్షోభంలోనూ 5 వేల టన్నుల డీజిల్ సరఫరా
ఖతార్ నిర్ణయం వల్ల ఇరాన్-అమెరికా మధ్య ఉన్న ఏకైక దౌత్య మార్గం మూసుకుపోయే ప్రమాదం ఉంది. ఇది యుద్ధాన్ని మరింత తీవ్రం చేయడమే కాకుండా.. అంతర్జాతీయ క్రూడ్ అండ్ నేచురల్ గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల వల్ల గ్యాస్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఖతార్ వంటి తటస్థ దేశం కూడా ఇరాన్‌కు దూరం కావడం.. పశ్చిమాసియాలో ఇరాన్ ఒంటరి అవుతోందనే సంకేతాలను ఇస్తోంది. ఈ దౌత్య సంక్షోభం శాంతి చర్చలను మరింత క్లిష్టతరం చేసే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
