మెగా మాతృమూర్తి అంజనాదేవికి 'బాపు బొమ్మ' పురస్కారం..

మెగా మాతృమూర్తి అంజనాదేవికి 'బాపు బొమ్మ' పురస్కారం..

తెలుగువారి ఆత్మగౌరవానికి, అందానికి ప్రతీకగా ‘బాపు బొమ్మ’గా ముద్ర వేయించుకున్న ప్రముఖ నటి దివ్యవాణి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ఒక అద్భుతమైన వేదికను ఆవిష్కరించారు. సమాజంలోని వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరుస్తున్న మహిళా మూర్తులను గౌరవించారు. 2026 సంవత్సరానికి గాను "బాపు బొమ్మ - విశ్వ మహిళ" పురస్కారాల ప్రదానోత్సవాన్ని హైదరాబాద్‌లోని అత్యంత వైభవంగా నిర్వహించారు.

మెగా మాతృమూర్తికి తొలి పురస్కారం

మెగా మాతృమూర్తి శ్రీమతి కొణిదెల అంజనాదేవి కి తొలి పురస్కారం అందజేశారు.. ‘బాపు బొమ్మ’ పురస్కారానికి ఆమెతో శ్రీకారం చుట్టడం అత్యంత అభినందనీయమని వక్తలు కొనియాడారు. వీరితో పాటు రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, జనేతా కంచర్ల (యు.ఎస్.ఏ), డాక్టర్ వెన్నెల గద్దర్, డాక్టర్ పద్మజా చంద్రకాంత్, గాయని సమీరా భరద్వాజ్, రేఖారాణి, డి. జ్యోతిరెడ్డి (యు.ఎస్.ఏ) వంటి దిగ్గజ మహిళామణులు ఈ అవార్డులను అందుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ‘విశ్వ మహిళ’ గళం

మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ సందర్భంగా దివ్యవాణి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా, ఈ పురస్కార వేడుకలను భవిష్యత్తులో దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించడమే తన లక్ష్యమని ఆమె ఉద్ఘాటించారు. సాటి మహిళల్లో స్ఫూర్తిని నింపేందుకు దివ్యవాణి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, బహుముఖ ప్రజ్ఞాశాలి హర్షవర్ధన్, డిప్యూటీ కలెక్టర్ ఇ. వెంకటాచారి, ఏసీపీ కిరణ్ కుమార్ తదితరులు అతిథులుగా విచ్చేసి సందడి చేశారు.దివ్యవాణి ప్రారంభించిన ఈ ప్రతిష్టాత్మక అవార్డును ముందుగా మెగా మాతృమూర్తికి అందించడం పట్ల వక్తలు హర్షం వ్యక్తం చేశారు.