దేశంలో సామాన్యుడిపై ధరల భారం ఎంత ఉందో లెక్కించే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం సమూలంగా మార్చేస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు వస్తువులను కొనుగోలు చేసే పద్ధతులు మారడంతో, ద్రవ్యోల్బణ గణనలోనూ ఆ మార్పులను ప్రతిబింబించేలా కొత్త చర్యలు చేపట్టింది. ఇకపై ధరల వివరాల కోసం కేవలం వీధి చివర ఉన్న కిరాణా కొట్టుపైనే కాకుండా.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లలోని డేటాను పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించింది.
ప్రస్తుతం మనం ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి 2012ను బేస్ ఇయర్ గా వాడుతున్నాం. అయితే దశాబ్ద కాలంలో భారతీయుల జీవనశైలిలో భారీ మార్పులు వచ్చాయి. అందుకే ఈ పాత పద్ధతికి స్వస్తి పలికి.. 2024ను కొత్త బేస్ సంవత్సరంగా మార్చాలని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ కొత్త విధానం ఫిబ్రవరి 2026 నుంచి అమలులోకి రానుంది. దీనివల్ల మార్కెట్లో వస్తువుల ధరల పెరుగుదలపై మరింత ఖచ్చితమైన సమాచారం లభించే అవకాశం ఉంది.
ఈ కొత్త విధానంలో భాగంగా.. దేశవ్యాప్తంగా 12 ప్రధాన నగరాల్లోని ఈ-కామర్స్ డేటాను ప్రభుత్వం సేకరించనుంది. నిత్యావసర సరుకులు మాత్రమే కాకుండా.. విమాన టికెట్లు, టెలికాం ఛార్జీలు, OTT సబ్‌స్క్రిప్షన్లు వంటి డిజిటల్ సేవల ధరలను కూడా ఆన్‌లైన్ నుండే నేరుగా సేకరిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం అత్యాధునిక వెబ్ స్క్రాపింగ్ టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించబోతోంది. దీనివల్ల క్షేత్రస్థాయిలో డేటా సేకరణలో తలెత్తే జాప్యం తగ్గి, ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుబాటులోకి వస్తుంది.
►ALSO READ | వాట్సాప్ యూజర్లకు వార్నింగ్ : మీ ప్రైవేట్ మెసేజ్‌లను హ్యాకర్లు సైలెంటుగా చూస్తుండొచ్చు...
మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే.. నిత్యావసర వస్తువుల జాబితాలో మార్పులు చేయడం. పాత పద్ధతిలో ఆహార పదార్థాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. కానీ కొత్త సిరీస్‌లో ప్రజలు విద్య, వైద్యం, వినోదం, డిజిటల్ సేవలపై చేసే ఖర్చులకు మరింత వెయిటేజీ ఇవ్వనున్నారు. అలాగే అద్దె ఇళ్ల ధరల వివరాలను కూడా గతంలో ఆరు నెలలకు ఒకసారి సేకరించేవారు. ఇప్పుడు ఆ ప్రక్రియను ప్రతినెల నిర్వహించనున్నారు. ఈ సమగ్ర మార్పుల వల్ల రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు సామాన్యుల వాస్తవ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా ఉంటాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మార్పు వాస్తవికతకు దగ్గరగా.. సరైన నిర్ణయాలు తీసుకోవటానికి మరింత వీలుగా ఉంటాయని నిపుణులు అంటున్నారు.
