బిక్కుమల్ల సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ ఖాన్.. కంటతడి పెట్టిస్తున్న 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' మెలోడీ!

బిక్కుమల్ల సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ ఖాన్.. కంటతడి పెట్టిస్తున్న 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' మెలోడీ!

భారతీయ సైనికుల అసమాన ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచిన 2020 గల్వాన్ లోయ ఉదంతం నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్'. ఇప్పటికే ఈ సినిమాలోని 'మాతృభూమి' గీతం 50 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దేశభక్తి సెగలు రేపుతోంది. తాజాగా ప్రేమికుల రోజు (ఫిబ్రవరి 14) సందర్భంగా ఈ మూవీ నుంచి  'మేన్ హూన్' (Main Hoon) అనే ప్రత్యేక మెలోడీని చిత్రబృందం విడుదల చేసింది.

కంటతడి పెట్టించే భావోద్వేగంతో..

ఈ పాట కేవలం ఒక రొమాంటిక్ నంబర్ మాత్రమే కాదు, ఒక సైనికుడి కుటుంబం ఎదుర్కొనే విరహ వేదనకు అద్దం పడుతుంది. సల్మాన్ ఖాన్, చిత్రంగద సింగ్ జంటగా నటించిన ఈ పాటలో లడఖ్ పర్వత శ్రేణుల మధ్య వారి జీప్ రైడ్లు, ఆలయ సందర్శనలు అత్యంత సహజంగా, మనోహరంగా చూపించారు. ఈ సాంగ్ తో సల్మాన్, చిత్రంగదల మధ్య కెమిస్ట్రీ పరిణతితో కూడి, ఎంతో ఆర్గానిక్‌గా ఉందని అభిమానులు ప్రశంసిస్తున్నారు. సరిహద్దుల్లో విధి నిర్వహణకు వెళ్లే ముందు కుటుంబంతో గడిపే మధుర క్షణాలు, ఆ తర్వాత వచ్చే ఒంటరితనం, ఎదురుచూపులను ఈ పాటలో హృద్యంగా ఆవిష్కరించారు. 

అయాన్ లాల్ సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ పాటను శ్రేయా ఘోషల్, అయాన్ లాల్ అద్భుతంగా ఆలపించారు. అయాన్ లాల్, షబ్బీర్ అహ్మద్ అందించిన సాహిత్యం సైనికుడి త్యాగాన్ని, మౌనాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ప్రమోషన్స్‌లో భాగంగా నిజ జీవిత రిటైర్డ్ ఆర్మీ దంపతుల కథలను కూడా జోడించడం ప్రేక్షకులను మరింతగా కనెక్ట్ చేస్తోంది.

బిక్కుమల్ల సంతోష్ బాబు పాత్రలో సల్మాన్

ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ 16వ బీహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్, తెలుగు తేజం కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు పాత్రను పోషిస్తున్నారు. చైనా సైన్యంతో పోరాడి వీరమరణం పొందిన ఆయన ధైర్యగాథను దర్శకుడు అపూర్వ లఖియా వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. జైన్ షా, అంకుర్ భాటియా ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు.  సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ భారీ యుద్ధ చిత్రం ముందుగా ఏప్రిల్ 17న విడుదల కావాల్సి ఉండగా, తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 14, 2026న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.