హైదరాబాద్ నెక్నాంపూర్ లో రూ. రెండు వేల 500 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా.. 23 ఎకరాలను కాపాడిన హైడ్రా.. 

హైదరాబాద్ నెక్నాంపూర్ లో రూ. రెండు వేల 500 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా.. 23 ఎకరాలను కాపాడిన హైడ్రా.. 

హైదరాబాద్ లోని నెక్నాంపూర్ లో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడింది హైడ్రా. నెక్నాంపూర్ లోని సర్వే నంబర్ 20లో ఉన్న 23 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు ఫిర్యాదు రావడంతో సోమవారం ( డిసెంబర్ 22 ) రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ఆక్రమణలను తొలగించారు. కబ్జాకు గురైన భూమి విలువ సుమారు రూ. రెండు వేల 500 కోట్లకు పైగా ఉండచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. ఆక్రమణలు తొలగించిన అధికారులు భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి.. ప్రభుత్వ భూమి అని తెలియజేస్తూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ భూమి కబ్జాపై స్థానికుల ఫిర్యాదు రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి హైడ్రా క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు.రెవెన్యూ రికార్డుల ప్రకారం భూమి పూర్తిగా ప్రభుత్వ భూమిగా నిర్దారణ అయినట్లు తెలిపారు అధికారులు.ఈ క్రమంలో సదరు భూమిలో అక్రమ కట్టడాలు, ప్రహరీలు, షెడ్డులను తొలగించారు హైడ్రా అధికారులు.

హైడ్రా గతంలోనే కొన్ని నిర్మాణాలను నేలమట్టం చేసినప్పటికీ తాజాగా మరికొన్ని ప్రహరీలు, షెడ్డులు వెలిశాయంటూ హైడ్రాకు ఫిర్యాదు చేశారు స్థానికులు. ఈ క్రమంలో సామాన్యులను ముందు పెట్టి బడాబాబులు చేసిన కబ్జా ప్రయత్నాలకు బ్రేక్ వేసింది హైడ్రా. తప్పుడు రికార్డులతో భూమి స్వాధీనం చేసుకునే కుట్ర భగ్నం చేశామని తెలిపారు హైడ్రా అధికారులు.

ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రాకు కృతజ్ఞతలు తెలిపారు స్థానికులు. నగర ప్రణాళిక నిబంధనల ప్రకారం ఈ భూమిని ఓపెన్ స్పేస్, గ్రీన్ జోన్లుగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.