మానవ జీవితం అనేక అన్వేషణల సమాహారం. పుట్టుకతో మొదలైన ప్రయాణం మరణంతో ముగుస్తుంది. అయితే, ఈ ప్రయాణంలో మనం పంచుకునే బంధాలు, అనురాగాలు కేవలం ప్రాణం ఉన్నంత వరకే పరిమితం కావు. మరణానంతరం కూడా ఆ వ్యక్తి పట్ల మనం చూపే గౌరవం, ప్రేమ మన సంస్కారానికి ప్రతీకలు.
ఈ సున్నితమైన అంశాన్ని రెండు వేర్వేరు కోణాల నుండి ‘సమాధానం’, ‘ఆఖరి చూపు’ కథలు
అద్భుతంగా ఆవిష్కరించాయి. మొదటి కథ ‘మా వేములవాడ కథలు’ మొదటి పుస్తకంలో ఉంటే రెండవది ‘మా వేములవాడ కథలు -2’లో ఉంది.
మరణం - ఒక భయం, ఒక భావోద్వేగ భావన
‘సమాధానం’ కథలో సత్యం అన్నయ్యపాత్రలో మనకు ఒక విభిన్నమైన మానసిక స్థితి కనిపిస్తుంది. చాలామంది తమకు ఇష్టమైన వ్యక్తులు మరణించినప్పుడు, వారి భౌతిక కాయాన్ని చూడటానికి ఇష్టపడరు. దానికి కారణం–తమ స్మృతి పథంలో ఆ వ్యక్తి ఎప్పుడూ చిరునవ్వుతో, ప్రాణంతో ఉన్నట్టే గుర్తుండాలని, ఆ ‘పార్థివదేహం’ అనే నిశ్చల దృశ్యం తమ పాత జ్ఞాపకాలను చెరిపివేస్తుందని ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఒక రకమైన భావోద్వేగ భావన.
కానీ, కథ చివరలో సత్యం అన్నయ్య పాత్ర ద్వారా ఒక గొప్ప సత్యం ఆవిష్కృతమవుతుంది.
‘సమాధానం’ కథ చివరలో రెండు పాత్రల సంభాషణ ఇలా ఉంటుంది.
“రాజేందర్! నువ్వు నన్ను ఎప్పుడూ అడగలేదు కానీ.. రఘు నన్ను నాలుగేళ్లుగా ప్రశ్నిస్తూనే ఉన్నాడు. చనిపోయిన నన్ను ఆఖరి చూపు చూడడానికి కూడా ఎందుకు రాలేదని తరచూ ప్రశ్నిస్తూ ఉన్నాడు. వాడికి సమాధానం ఈ రోజు చెప్పాను. నీకు కూడా చెప్పాలని అనిపించింది” అన్నాడు.
కాసేపు నిశ్శబ్దం.ఏం మాట్లాడాలో నాకు తోచలేదు.“నేను వచ్చినప్పుడు చెప్పండి” అన్నాను కాస్త ఆలోచించి.“అవసరం లేదు. నేను చెప్పేది విను” అన్నాడు.
“అన్నయ్య..చెప్పండి” అన్నాను.కుటుంబసభ్యుల మరణాలను తప్ప ఎవరి మరణాలను నేను చూడలేదు. వాళ్ళు శవంగా మారిన దృశ్యాన్ని నేను ఊహించుకోలేను. నా సన్నిహితులు, స్నేహితుల ముద్ర నా స్మృతి పథంలో శవంగా ఉండకూడదని నా ఆలోచన. ఈ కారణంగానే రఘు చనిపోయిన తర్వాత చూడడానికి రాలేదు.
దహన సంస్కారాలకి రాలేదు. 15 రోజుల తర్వాత వాళ్ళని కలిసి పరామర్శిస్తాను. నా అభిప్రాయం సరైందేనా? అని ఎవరూ ఎప్పుడూ నన్ను ప్రశ్నించలేదు. కానీ, ఈ నాలుగేళ్లుగా రఘు ఈ ప్రశ్న వేస్తున్నట్టు నేను ఫీల్ అవుతున్నాను.
“చెప్పండి అన్నయ్య” అన్నాను..“ఇప్పుడు నా అభిప్రాయం మారిపోయింది. నేను ఇంత కాలం చేసింది సరైంది కాదని నాకనిపిస్తోంది. ఆఖరి చూపు విలువని ఇంతకాలం తెలుసు కోలేకపోయాను.మన ప్రేమని, గౌరవాన్ని వ్యక్తపరిచే చివరి సంఘటన శవాన్ని దర్శించడం. అక్కడ ఓ దండం పెట్టడం. ఓ పుష్పగుచ్ఛాన్ని ఉంచడం. వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి దుఃఖాన్ని పంచుకోవడం ఎంతో అవసరం.
“ఇదే రఘుకి జవాబుగా చెప్పాను. రఘు నన్ను ప్రశ్నించటం మానేశాడు.”ఈ సమాధానం నాకు చెప్పాడా? రఘుపతన్నకి చెప్పాడా? నాకు తెలియదు. కానీ చాలా కాలం నుంచి నాలో నలుగుతున్న సందేహానికి సమాధానం దొరికింది.’’ఇదీ కథ.“మన ప్రేమని, గౌరవాన్ని వ్యక్తపరిచే చివరి సంఘటన శవాన్ని దర్శించడం.’’ తీరని వేదన - ఆఖరి చూపు లేని శోకం
రెండవ కథ ‘ఆఖరి చూపు’లో లక్ష్మి పాత్ర ద్వారా వ్యక్తమైన ఆవేదన ప్రతి పాఠకుడి గుండెను పిండేస్తుంది.ఇక్కడ ఆఖరి చూపు అనేది కేవలం ఒక ఆచారం కాదు, ఒక భావోద్వేగ అంశం. కేవలం ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన లక్ష్మికి జీవితకాలపు వెలితిని మిగిలిస్తుంది.
‘ఆఖరి చూపు’ముగింపు ఇలా ఉంటుంది.
“సిరిసిల్ల నుంచి జీపు వచ్చింది. జీపు నుంచి దిగి లక్ష్మి పరుగు పరుగున అక్కడికి వచ్చింది. అప్పుడే నిప్పు పెట్టిన అక్కయ్య కొడుకు అక్కడికి వచ్చాడు. అప్పటికే మంట పైకి లేస్తుంది. లక్ష్మి హతాశురాలైంది. అరే! ఎంత పని జరిగింది. ఓ ఐదునిముషాలు ముందు వచ్చినా బాగుండేది. దహన కార్యక్రమం ఓ ఐదు నిముషాలు ఆలస్యం అయినా బాగుండేదని అందరికీ అనిపించింది. లక్ష్మి ఎవరినో అలుముకొని శోకం మొదలుపెట్టింది.
ఎంతపనైపోయింది అక్కయ్య.
నా జీపు ఓ పది నిముషాలు ముందుగా ఎందుకు రాకపోయె అక్కయ్య.
నాకు ఓ గంట ముందు ఎందుకు తెలువక పోయె అక్కయ్య.
నీ పాణం మంచిగ లేదని తెల్సి
నిన్ననే ఎందుకు రాకపోతి అక్కయ్య.
నిన్ను చూడకుండనే
నువ్వు పోవడ్తివా అక్కయ్య.
నేనేం పాపం చేసిన అక్కయ్య.
ఆఖరు సారి చూడకుండా
దేవుడు ఇట్ల ఎందుకు చేసిండు అక్కయ్య.
నేను బతికినంత కాలం
నిన్ను ఆఖరు సారి చూడలేదని బాధ
ఉంటుందక్కయ్య.
ఆమె శోకగీతం అంతులేకుండా కొనసాగింది. అక్కయ్య చనిపోయిందన్న బాధ కన్నా, ఎక్కువ ఆఖరిసారిగా అక్కయ్యను చూడలేకపోయానని ఆమె బాధ, వేదన.అది దుఃఖం కాదు.. శోకం. ఆ శోకం ఒక్కసారి అక్కడున్న వాళ్ల బాధని రెట్టింపు చేసింది.
మన స్మృతిలో నుంచి వ్యక్తులు పోనప్పటికీ ఆఖరి చూపు ఆఖరి చూపే. మొదటి చూపు ఎంతో ఆఖరి చూపూ అంతే. ఇది సెంటిమెంట్ కాదు. మనిషి మనస్సుకి సంబంధించిన అంశం. అందుకే చనిపోయిన ఆత్మీయులని చివరిసారి చూస్తాం.
ఆమె దుఃఖాన్ని చూసిన నాకు నా కవిత గుర్తుకొచ్చింది.సెంటిమెంటని కొట్టి పారెయ్యకు..మొదటి చూపు ఎంత అవసరమోఇదీ అంతే!/ పుట్టిన పసిపాపను చూసే మొదటి చూపు/ ఎలాంటిదో/ ఇదీ అంతే!/ అందులో ఎంత ప్రేమ వుందో - ఇందులోనూ అంతే!/ ఇంకా చెప్పాలంటే/ ఇందులో ప్రేమ ఉంది/ ఆత్మీయత ఉంది/వేదన ఉంది/ అందుకే మొదటి చూపు ఎంత అవసరమో/ ఆఖరి చూపు అంతకన్నా ఎక్కువే అవసరం’’అన్న కవితా పంక్తులు ఈ కథలకు ప్రాణవాయువు వంటివి.
బిడ్డ పుట్టినప్పుడు కలిగే ఆనందం మొదటి చూపు అయితే, ఆ బిడ్డ లేదా ఆత్మీయుడు శాశ్వతంగా దూరమవుతున్నప్పుడు చూసే చూపు.. వారిని మన కళ్ళతో మనసులోకి పంపించే ప్రక్రియ. అది సెంటిమెంట్ కాదు, అది మనిషి మనసుకి సంబంధించిన ఒక అనివార్యమైన ముగింపు.
ఈ మధ్య మా పెద్దక్క (సుమిత్రక్క)చనిపోయింది. నేను అమెరికాలో ఉన్నాను. ఆమె ఆఖరిచూపుకి వెళ్ళలేని పరిస్థితి.ఆఖరి చూపు సెంటిమెంటే కాదు.అదొక ప్రేమ, ఆత్మీయత, ఓ భరోసా.
సుమిత్రక్కా -ఆఖరిచూపుని చూడలేక పోయినా నువ్వు నా కళ్ళల్లో కదలాడతావు అమ్మలా.. అనుకున్నాను.ఆఖరి చూపు చూడాలని అనుకొని చూడ లేని వాళ్ళ పరిస్థితి.
- డా. మంగారి రాజేందర్,కవి, రచయిత,9440483001-
