ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10న హైదరాబాద్ పర్యటనలో భాగంగా జాతీయ రహదారులు, రైల్వే లైన్ల అభివృద్ధి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ ఆయిల్ టెర్మినల్, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, జహీరాబాద్ సమీపంలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ టౌన్ షిప్ అభివృద్ధి ప్రాజెక్టుల పనులకు హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో వర్చువల్‌గా శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేసి జాతీయ భద్రత, జాతీయ అభివృద్ధి ప్రధానమనీ, ఆ తర్వాతే రాజకీయ పార్టీలని స్పష్టం చేశారు.
- దేశ నిర్మాణంలో భాగంగా తాము కూడా
భాగస్వాములమై తెలంగాణ రైజింగ్ 2047 రూపకల్పన చేశామని, 2034 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రేవంత్ తెలిపారు. దానికోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కోరారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే మహా నగరాలను అభివృద్ధి చేయాలని, హైదరాబాద్ మహానగరానికి రెండో ఫేజ్ మెట్రోలైన్ సాంక్షన్, మూసీ పునరుజ్జీవనం, రేడియల్ రోడ్లు, హైదరాబాద్- నుంచి మచిలీపట్నం వరకు 12 వరుసల రహదారి వంటి ప్రాజెక్టులకు తక్షణమే అనుమతిచ్చి సహకరించాలని కోరుతూ మెమొరాండం ఇచ్చారు.
దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ తెలంగాణ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తామనీ దానికి రాష్ట్ర ప్రభుత్వం తమతో జట్టు కట్టాలని అన్నారు. దీనివల్ల తెలంగాణకు భారీ లబ్ధి చేకూరుతుందని, అయితే అభివృద్ధిలో తెలంగాణ చేరాల్సిన చోటికి చేరలేదని హైవేల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నదని తెలిపారు. కానీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభివృద్ధి కోసం విజ్ఞప్తి చేసిన ప్రాజెక్టుల అనుమతులపై మాత్రం మౌనం వహించారు.
- తెలంగాణ అభివృద్ధిపై పక్షపాత వైఖరి
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి అవుతున్నది. అప్పటినుంచీ దేశ ప్రధానిగా నరేంద్ర మోదీనే కొనసాగుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలుచేసే ప్రయత్నం చేయలేదు. పైగా 'తల్లిని చంపి బిడ్డను బతికించారు’ అనేవిధంగా పార్లమెంటులో వ్యాఖ్యానించడం బట్టి తెలంగాణపై ప్రధాని వైఖరి ఏమిటో అర్థమవుతుంది. ముఖ్యంగా విభజన చట్టంలో పేర్కొన్న కృష్ణా, - గోదావరి నదీజలాల పంపిణీలలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నివా రించకపోగా నేటికీ నీటివాటాల కేటాయింపులు తేల్చలేదు.
కృష్ణా, గోదావరి నదీజలాల మేనేజ్మెంట్ బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ.. కృష్ణానదిలో ఏపీ రాష్ట్రం నీటి దోపిడీ యథేచ్ఛగా జరుగుతూనే ఉంది. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఏపీకే అనుకూలంగా వ్యవహరిస్తోంది. గోదావరి జలాలను అక్రమంగా బనకచర్ల ద్వారా రాయలసీమ ప్రాంతానికి తరలించే ప్రాజెక్టును తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ అనుమతులు ఇచ్చేందుకు సిద్ధమైంది.
- తెలంగాణ మొర ఆలకించాలి
ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకుండా పెండింగ్‌లోనే పెడుతున్నారు. తెలంగాణలో కొత్తగా నిర్మించుకుంటున్న ఒక ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పిస్తామని ఇచ్చిన హామీ కూడా అతీగతీలేదు. దీనిపై గతంలో బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి విన్నవిస్తున్నా... తెలంగాణ మొర ఆలకించేవారు లేరు. కేంద్రం మొండివైఖరితో వ్యవహరిస్తోంది. గోదావరిపై చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు లేదా పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని కోరుతున్నా అమోదించడం లేదు.
వెనకబడిన ప్రాంతాల జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం(బీఆర్ జీఎఫ్) పథకం కింద తెలంగాణలోని 9 జిల్లాలకు రూ.50 కోట్ల చొప్పున ఇవ్వాల్సి ఉండగా ఎగ్గొట్టారు. చివరికి ఈ స్కీమునే ఎత్తివేశారు. రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అవుతున్నా విభజన చట్టంలో ఉన్న హామీమేరకు ట్రైబల్ యూనివర్సిటీకి పూర్తిస్తాయి నిధులు ఇవ్వడంలేదు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం ఊసే లేదు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి బదులు.. ఓవర్ హాలింగ్ యూనిట్‌ను మాత్రమే ఏర్పాటుచేసి చేతులు దులుపుకున్నారు.
- నెరవేరని మోదీ ఎన్నికల హామీలు
2019 ఎన్నికల ప్రణాళికలో ‘పీఎం కల్యాణ్ యోజన' పథకం కింద దేశవ్యాప్తంగా చిన్న, సన్నకారు రైతులందరికీ పింఛన్లను అందజేస్తామని మోదీ ప్రకటించారు. ఇది దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. కానీ, ఇప్పటివరకు ఒక్క రైతుకు కూడా పింఛన్ ఇచ్చింది లేదు. 2024 ఎన్నికల ముందు 'పీఎం ముక్తి బిజిలి యోజన' స్కీమ్ ద్వారా దేశంలోని పేద కుటుంబాలన్నింటికీ ఉచిత విద్యుత్తును అందజేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఈ స్కీమ్ కూడా అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. కానీ ఈ స్కీమ్ ను మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయలేదు. ఎన్నికలప్పుడు అన్నీ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు ఇంటిపై సౌర విద్యుత్‌ను ఏర్పాటు చేసుకోండి, ఫ్రీ కరెంట్ దానంతట అదే వస్తుందంటూ కేంద్రం ఉచిత సలహా ఇస్తోంది. 2014 ఎన్నికల్లో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు అవుతున్నా మోదీ సర్కార్ ఇప్పటికీ హామీని నిలబెట్టుకోలేదు. నేటికీ దేశంలో 80 శాతం గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు లేవు. ఇప్పటికీ ఉపాధికల్పన పథకాలు లేవు. దేశ ఆర్థిక వ్యవస్థకు నల్లధనం
పెనుముప్పుగా మారింది. మేం అధికారంలోనికి వస్తే స్విస్ బ్యాంకులో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కు తీసుకొచ్చి ప్రతి భారతీయుడు బ్యాంక్ ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామంటూ హామీ ఇచ్చారు. మోదీ ఇచ్చిన అన్ని హామీల్లాగే ఇది కూడా జుమ్లాగానే మిగిలిపోయింది.
- తెలంగాణ అభివృద్ధికి మోదీ సహకరించాలి
2019 ఎన్నికల ప్రణాళికలో దేశంలో 60 ఏళ్లు దాటిన పేదలకు పెన్షన్ పథకం ప్రకటించినా.. కేంద్రం జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం(ఎన్ ఎస్ఎపి) కింద ప్రతి నెల వృద్ధులకు రూ.200, వికలాంగులకు రూ. 300 చొప్పున మాత్రమే చెల్లిస్తుంది. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్లు, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, ఇతర చేతివృత్తులవారికి రూ. 2000, వికలాంగులకు రూ.4000 చెల్లిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం పెన్షన్లు కేంద్రం చెల్లించడం గమనార్హం.
ఈ సహాయాన్ని పెంచుతామని మోదీ వాగ్దానం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో 42 లక్షల ఆసరా పింఛన్లు ఉండగా.. వాటిలో కేంద్రం కేవలం 5 లక్షల మందికి అందిస్తోంది. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేవిధంగా స్వరూపాన్ని మార్చి.. రాష్ట్రాలపై భారం మోపారు. 2020 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న వాగ్దానం ఒక మోసం. రైతులు ప్రస్తుతం రుణ ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు.
పండించిన పంటకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం సాగుకయ్యే ఖర్చులపై 50 శాతాన్ని కలిపి మద్దతు ధర చెల్లిస్తామంటూ 2016 ఏప్రిల్ 14 న తన పర్యటన సందర్భంగా ప్రకటించారు. దీనిపై ఎటువంటి చర్యలు లేవు. ఈ విధంగా ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ గతంలో అనేక వాగ్దానాలు చేశారు. కానీ, హామీలు అమలుచేయడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇకనైనా జాతీయ అభివృద్ధిలో భాగంగా తెలంగాణ ప్రాజెక్టులకు సత్వరం అనుమతులిచ్చి దేశ ప్రధానిగా మోదీ తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి.
ఉజ్జిని రత్నాకర్ రావు
సీపీఐ సీనియర్ నాయకుడు
Note: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
