- రెండు విద్యా సంవత్సరాలకు విడుదలైన నిధులు
- ఇన్స్ స్ర్టక్టర్, ఆయాల నియామకంలో తప్పిదాలు
- బినామీ పేర్లతో దారి మళ్లిన నిధులు !
- 3 పాఠశాలల నిధులు వెనక్కి..
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: గ్రామ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలకు క్షేత్రస్థాయిలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం ఆటంకంగా మారుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాఠశాలల్లో ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మంజూరు చేస్తున్న ప్రీ ప్రైమరీ నిధులను సక్రమంగా వినియోగించాల్సి ఉండగా, కొన్నిచోట్ల నిధులను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బినామీ పేర్లతో నిధులను దారి మళ్లించారనే ఆరోపణలు సైతం వ్యక్తమవుతున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2024-25, 2025-26 విద్యా సంవత్సరాల్లో ప్రీ ప్రైమరీ కార్యక్రమం కింద ఎంపికైన 11 పాఠశాలల్లో నిధుల వినియోగంపై పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇన్‌స్ట్రక్టర్, ఆయాల నియామకాల్లో విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మూడు పాఠశాలలకు మంజూరైన నిధులు తిరిగి వెళ్లినట్లు అధికారులు చెబుతుండటం చర్చనీయాంశంగా మారింది.
నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రీ ప్రైమరీ విద్యాబోధన కోసం భూపాలపల్లి మండలం దూదేకులపల్లి, గొల్లబుద్ధారం, టేకుమట్ల మండలం సుబ్బక్కపల్లి, చిట్యాల మండలం నైన్‌పాక, మహాముత్తారం, మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి, కొత్తపల్లిగోరి మండల కేంద్రంతోపాటు నిజాంపల్లి, కొనరావుపేట, కొత్తపల్లి (కే), వెంకటేశ్వర్లపల్లి గ్రామాల్లోని పాఠశాలలను ఎంపిక చేశారు.
ఈ పాఠశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఇన్‌స్ట్రక్టర్, ఆయాలను నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇన్‌స్ట్రక్టర్‌కు నెలకు రూ.8 వేలు, ఆయాకు రూ.6 వేలు చొప్పున 10 నెలల పాటు వేతనం చెల్లించేలా నిధులు కేటాయించారు. అయితే ఆయా పాఠశాలల్లో నియామకాలు చేపట్టడంలో అధికారులు, పాఠశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి.
2025 మార్చి 29న తొలి విడతగా రూ.15.40 లక్షలను ఆయా పాఠశాలల గ్రాంట్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. అయితే, విద్యా సంవత్సరం ముగిసే వరకు ఇన్‌స్ట్రక్టర్, ఆయాల నియామకాలు జరగలేదని తెలుస్తోంది. రెండో విడతలోనూ రూ.15.40 లక్షలు మంజూరవగా, నియామకాలు చేపట్టకుండానే ఖాతాల్లో జమ అయిన నిధులను కొన్ని పాఠశాలల్లో పాఠశాల అభివృద్ధి పేరుతో వినియోగించినట్లు, మరికొన్ని చోట్ల నిధులు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రూ.4.20 లక్షలు వెనక్కి..
ఇన్‌స్ట్రక్టర్, ఆయాల నియామకాలు చేపట్టకపోవడంతో జిల్లాలోని మూడు పాఠశాలలకు మంజూరైన రూ.4.20 లక్షల నిధులు తిరిగి వెనక్కి వెళ్లినట్లు విద్యాశాఖ ఆఫీసర్లు చెబుతున్నారు. నైన్‌పాక, కొత్తపల్లి (కే), కొనరావుపేట పాఠశాలల్లో రెండో విడతలోనూ ఇన్‌స్ట్రక్టర్, ఆయాల నియామకాలు చేపట్టలేదని సంబంధిత పాఠశాలల హెచ్‌ఎంలు చెప్పడంతో నిధులు వెనక్కి వెళ్లినట్లు ఆఫీసర్లు పేర్కొంటున్నారు. మరోవైపు రెండో విడతలో ఎంపికైన 44 పాఠశాలల్లోనూ ఇన్‌స్ట్రక్టర్, ఆయాల నియామకాలు చేపట్టకుండానే ఆర్థిక సంవత్సరం ముగిసింది.
ప్రస్తుత ఏడాదిలోనూ పాఠశాలల ఎంపిక, నియామకాల ప్రక్రియలో జాప్యం జరుగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఉద్దేశించిన ప్రీ ప్రైమరీ విద్యా కార్యక్రమం లక్ష్యం నెరవేరాలంటే నిధుల వినియోగంపై పారదర్శకతతో పాటు ఇన్‌స్ట్రక్టర్, ఆయాల నియామకాలను సకాలంలో చేపట్టాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
బినామీ పేర్లతో నిధుల మళ్లింపు ?
2025-26 లో తొలి విడతలో ఎంపికైన 11 పాఠశాలలకు అదనంగా మరో 44 పాఠశాలలను ప్రీ ప్రైమరీ కార్యక్రమం కోసం ఎంపిక చేశారు. అయితే కొత్తగా ఎంపికైన పాఠశాలల్లోనూ ఇన్‌స్ట్రక్టర్, ఆయాల నియామకాలు జరగలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, 11 పాఠశాలలకు రెండో విడతగా మరో రూ.15.40 లక్షలు పాఠశాలల ఖాతాల్లో జమ అయ్యాయి.
నిజాంపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్‌ను ఆయాగా, పాఠశాలలో పని చేయని మరో వ్యక్తిని ఇన్‌స్ట్రక్టర్‌గా నియమించినట్లు రికార్డుల్లో చూపించి, వారి ఖాతాల్లోకి నిధులు మళ్లించి, అనంతరం ఆ మొత్తాన్ని తమకు తిరిగి తీసుకున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై తల్లిదండ్రులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని మరో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య సింగిల్ డిజిట్‌కే పరిమితమైనప్పటికీ, అక్కడ కూడా ప్రీ ప్రైమరీ నిధులను బినామీ పేర్లతో పక్కదారి పట్టించినట్లు పలువురులు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిధులు వెనక్కి వెళ్లాయి..
జిల్లాలో రెండో విడత ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో నియమాకాలు లేవని సంబంధిత హెచ్ఎంలు చెప్పడంలో నిధులు వెనక్కి వెళ్లాయి. పాఠశాలల్లో నిధులు దుర్వినియోగం అయినట్లుగా దృష్టికి రాలేదు. ఇటీవల పాఠశాల నిధులపై ఆడిట్ పూర్తయ్యింది. ప్రీ ప్రైమరీ నిధులు పక్కదారి పట్టినట్లు తమ దృష్టికి వస్తే ఎంక్వైరీ చేసి, చర్యలు తీసుకుంటాం.
ముద్దమల్ల రాజేందర్, డీఈవో, జయశంకర్భూపాలపల్లి
