- ఓ డ్రైవర్ డ్రింక్ చేయకున్నా 54 పాయింట్లు
- మరో డ్రైవర్‌కు 73.. రెండోసారి టెస్ట్ చేస్తే జీరో పాయింట్స్
- మెషిన్ ఫాల్ట్ వల్ల ఉద్యోగాలు కోల్పోతున్నామని డ్రైవర్స్ ఆవేదన
- ఉదయం నుంచి సాయంత్రం వరకు డిపో ఎదుట ఆందోళన
- నిలిచిపోయిన 146 బస్సులు.. ప్రయాణికుల ఇబ్బందులు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల ఆర్టీసీ డిపోలో బ్రీత్అనలైజర్టెస్ట్అంటేనే డ్రైవర్లు వణికిపోతున్నారు. మద్యం తాగకున్నా తాగినట్టు చూపుతుండడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అసలు డ్రింక్చేసే అలవాటు లేనివారు సైతం ఫూటుగా తాగేసినట్టు భారీ రీడింగ్ ఇస్తుండడంతో కంగుతింటున్నారు. నేను తాగలేదు మొర్రో అని డ్రైవర్లు మొత్తుకున్నా అధికారులు నమ్మని పరిస్థితి నెలకొంది. మళ్లీ వెంటనే టెస్ట్చేస్తే జీరో రీడింగ్చూపెడుతోంది. సరిగా పనిచేయని బ్రీత్ అనలైజర్ పరికరాలను వాడుతూ ఆర్టీసీ అధికారులు తమ జీవితాలతో ఆడుకుంటున్నారని డ్రైవర్లు వాపోతున్నారు.
తాగకున్నా తాగినట్టు రిపోర్టు
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం ఆర్టీసీ విధి. ఇందుకోసం ప్రతిరోజు డ్రైవర్లు డ్యూటీ ఎక్కడానికి ముందు వారు మద్యం తాగి వచ్చారా, లేదా అని తెలుసుకునేందుకు ఆర్టీసీ ట్రాఫిక్అధికారులు బ్రీత్‌అనలైజర్‌తో టెస్టు చేస్తారు. మద్యం తాగినట్టు రిపోర్ట్వచ్చిన వారిని డ్యూటీకి అనుమతించకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఇందులో భాగంగా ఈ నెల 8న రాజ మల్లయ్య అనే డ్రైవర్‌కు టెస్టు చేయగా రీడింగ్ 54 పాయింట్లు రావడంతో నివ్వెరపోయాడు. తాను మద్యం తాగలేదని చెప్పినా అధికారులు వినిపించుకోలేదు.
ఆ రోజునుంచి ఆయనను డ్యూటీకి అనుమతించలేదు. రెండు రోజుల తర్వాత హైదరాబాద్‌వెళ్లే లహరి బస్సు డ్రైవర్‌కు టెస్ట్ చేస్తే 73 పాయింట్లు చూపింది. తనకు డ్రింక్ చేసే అలవాటే లేదని ఆయన మొత్తుకున్నా పట్టించుకోలేదు. అప్పటికప్పుడు మరో డ్రైవర్అందుబాటులో లేకపోవడం, తమకు లేట్ అవుతోందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు హైరానా పడ్డారు. ఆయనకు అదే మెషిన్‌తో రెండోసారి టెస్ట్చేస్తే జీరో రీడింగ్చూపింది. దీంతో విషయాన్ని కంట్రోలర్దృష్టికి తీసుకెళ్లి ఆ తర్వాత డ్యూటీకి అనుమతించారు.
డ్రైవర్ల ఆందోళనతో నిలిచిన బస్సులు
బ్రీత్అనలైజర్పరికరంలో లోపాల వల్ల తాను మద్యం తాగకున్నా తాగినట్టు రీడింగ్వచ్చిందని, మరో డ్రైవర్‌కు అలాగే రాగా రెండోసారి టెస్టు చేస్తే జీరో పాయింట్లు వచ్చాయని, ఆయనకో న్యాయం, నాకో న్యాయమా? అంటూ రాజమల్లయ్య తన కుటుంబసభ్యులతో కలిసి సోమవారం ఉదయం 4 గంటల నుంచి డిపో ఎదుట ఆందోళనకు దిగాడు. ఆయనకు మద్దతుగా మిగతా డ్రైవర్లు విధులు బహిష్కరించి డిపో ముందు బైఠాయించారు. బ్రీత్అనలైజర్మెషీన్లో సాంకేతిక లోపాల వల్లే తప్పుడు రిపోర్టులు ఇస్తోందని, తమ జీవితాలతో ఆడుకోద్దని అధికారులకు విన్నవించారు.
వారు స్పందించకపోవడంతో సాయంత్రం 5.30 గంటల వరకూ ఆందోళన కొనసాగించారు. దీంతో డిపోలోని 146 బస్సులు నిలిచిపోయాయి. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరకు పోలీసులు వచ్చి రాజమల్లయ్యను స్టేషన్‌కు తరలించారు. బ్రీత్అనలైజర్ను టెస్టుకు పంపించి అందులో లోపాలు ఉన్నట్లయితే రాజమల్లయ్యపై యాక్షన్ఉండదని, లేదంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని అధికారులు పేర్కొన్నారు. దీంతో డ్రైవర్లు ఆందోళన విరమించి డ్యూటీ ఎక్కారు.
గతంలోనూ ఇదే తీరు
గతంలోనూ మంచిర్యాల డిపోలో పలువురు డ్రైవర్లకు బ్రీత్అనలైజర్ టెస్టు నిర్వహించగా రాజు అనే డ్రైవర్‌కు 53 పాయింట్ల రీడింగ్వచ్చింది. వాస్తవానికి అతడికి మద్యం తాగే అలవాటే లేదని తెలిసింది. ఆ తర్వాత మరో డ్రైవర్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆయనకు ఏకంగా 274 పాయింట్లు చూపించింది. దీంతో ట్రాఫిక్‌పోలీసుల దగ్గరున్న పరికరంతో టెస్ట్చేస్తే జీరో పాయింట్లు చూపింది.
ఆగ్రహానికి లోనైన డ్రైవర్లు డిపో ఎదుట ఆందోళనకు దిగారు. తమను వేధింపులకు గురిచేయొద్దని, పనిచేయని బ్రీత్‌ఎనలైజర్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. పనిచేయని పరికరాలతో తమ ఉద్యోగాలు ఊడే పరిస్థితి నెలకొందని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. బ్రీత్అనలైజర్టెస్టులో మద్యం తాగినట్టు రిపోర్టు రావడంతో ఇప్పటికే పలువురు డ్రైవర్లు సస్పెండ్అయ్యారు.
