Weekend Movie Releases: హారర్, రొమాన్స్, యాక్షన్‌తో థియేటర్లలో భారీ రిలీజ్‌లు.. ముందున్న 'జన నాయగన్'!

Weekend Movie Releases: హారర్, రొమాన్స్, యాక్షన్‌తో థియేటర్లలో భారీ రిలీజ్‌లు.. ముందున్న 'జన నాయగన్'!

జూలై చివరి వారం దక్షిణాది సినీ అభిమానులకు అసలైన పండుగలా మారబోతోంది. తెలుగు, తమిళం,  మలయాళం, కన్నడ భాషలకు చెందిన పలు క్రేజీ చిత్రాలు వరుసగా థియేటర్లలోకి వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద హీట్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తమిళ స్టార్ విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ముందు నటించిన చివరి సినిమా 'జన నాయగన్' విడుదలపై దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో హారర్ కామెడీలు, ప్రేమకథలు, యాక్షన్ థ్రిల్లర్లు, ఫ్యామిలీ డ్రామాలు కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.

'జన నాయగన్' 

జూలై 23న విడుదల కానున్న 'జన నాయగన్'ఈ వారంలోనే ( జూలై 23.2026 ) అతిపెద్ద రిలీజ్‌గా నిలవనుంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ మాజీ పోలీస్ అధికారి తలపతి వేట్రి కొండన్ పాత్రలో కనిపించనున్నారు. ప్రశాంత జీవితాన్ని గడుపుతున్న అతడు సమాజాన్ని పీడిస్తున్న శక్తివంతమైన దుర్మార్గులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది? ఆ పోరాటం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేదే కథ. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. మమిత బైజు, ప్రియమణి, ప్రకాశ్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, నారేన్ కీలక పాత్రలు పోషించారు. విజయ్ రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టే ముందు వస్తున్న చివరి సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

'మహారాజా హాస్టల్'

ఇక అదే రోజు ( జూలై 23.2026 ) మలయాళంలో 'మహారాజా హాస్టల్' విడుదల కానుంది. పాత బాయ్స్ హాస్టల్‌లో తక్కువ అద్దె కోసం చేరిన ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడ దాగి ఉన్న భయానక రహస్యాలను ఎదుర్కొనే కథతో ఈ హారర్ కామెడీ తెరకెక్కింది. నవ్వులతో పాటు ఉత్కంఠను పంచే అంశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

 

'చెన్నై లవ్ స్టోరీ'

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, గౌరి ప్రియ కాంబినేషన్‌లో వస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా 'చెన్నై లవ్ స్టోరీ'  . ఐటీ హబ్‌ల మధ్య, లవ్ అండ్ కెరీర్ డ్రీమ్స్ మధ్య సాగే ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ జర్నీ.  చెన్నైలో తన కలలను సాకారం చేసుకునే క్రమంలో ప్రేమలో పడిన ఇద్దరు యువతి , యువకుడి భావోద్వేగ ప్రయాణాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించారు. ఈ మూవీ భారీ అంచనాల మధ్య జూలై 24న తెలుగు ప్రేక్షకుల కోసం రెడీ అవుతోంది. 

 

'కరావళి'

కన్నడలో కూడా భారీ పోటీ నెలకొంది. 'కరావళి' అనేది కర్ణాటకలోని సాంప్రదాయ కంబళ గేదెల పందాల ఆధారంగా రూపొందిన ఒక పీరియడ్ యాక్షన్ డ్రామా. ఇందులో ప్రజ్జ్వల్ దేవరాజ్, రాజ్ బి. శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం మూడు దశాబ్దాలకు పైగా సాగే కాలంలో కుటుంబ వైరం, ప్రతీకారం, ప్రాంతీయ గర్వం వంటి ఇతివృత్తాలను అల్లుతూ, తీరప్రాంత కర్ణాటక సంస్కృతిని కూడా ప్రదర్శిస్తుంది.

 

'చంద్రప్పన్'..

ద్రోహం , వ్యక్తిగత నష్టాన్ని ఎదుర్కొన్న తర్వాత, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక యువకుడి కథే చంద్రప్పన్. ఈ సంఘటనలే అతని జీవితాన్ని మలుపు తిప్పుతాయి. ధైర్యం, పట్టుదల, దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం వంటి సామాజిక ఇతివృత్తాలతో కూడిన ఈ యాక్షన్ చిత్రం ప్రధానంగా సాగుతుంది. అన్యాయంపై పోరాడే యువకుడి కథతో యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు జూలై 24న వస్తోంది.

 

'కాగితం పడవలు'..

వర్ధన్‌, కృష్ణప్రియ జంటగా నటిస్తున్న ప్రేమకథాచిత్రం 'కాగితం పడవలు'.  ఎంజీఆర్‌ తుకారం దర్శకుడు. కీర్తన నరేశ్‌, టీఆర్‌ ప్రసాద్‌రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప నిర్మాతలు. ఇప్పటికే ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తున్నదని మేకర్స్‌ ఆనందం వెలిబుచ్చారు.  ఈ 'కాగితం పడవలు' మెటాఫర్‌తో రామ్-గోదావరి అనే జంట మధ్య దూరం, తీపి జ్ఞాపకాల ఆధారంగా వస్తున్న క్లాసిక్ లవ్ అండ్ సెకండ్ ఛాన్స్ స్టోరీ. ఈ మూవీ జూలై 24న ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ద్వారా సినిమాప్రేక్షకుల ముందుకు వస్తోంది.

 

'శ్రీమతి సిందూర'..

ఆర్. అనంత రాజు దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం 'శ్రీమతి సిందూర'. ప్రేమ, కుటుంబ బంధాలు, ఫాంటసీ అంశాలను మిళితం చేసిన ఎమోషనల్ డ్రామా. ఇందు, భరత్ అనే యువజంట అరేంజ్డ్ మ్యారేజ్‌తో జీవితాన్ని ప్రారంభిస్తారు. కాలక్రమంలో వారి బంధం ప్రేమగా మారుతుండగా, అనూహ్య సంఘటనలు వారి జీవితాన్ని కొత్త మలుపు తిప్పుతాయి. ప్రేమ, నమ్మకం, త్యాగం, కుటుంబ విలువలను ఫాంటసీ టచ్‌తో చూపించే ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందింది. ఫాంటసీ డ్రామా జూలై 24 న రిలీజ్ కానుంది.

 

'కరిమణి మాలిక నీనల్ల'..

'కరిమణి మాలిక నీనల్ల' ప్రేమ, యాక్షన్, భావోద్వేగాల కలయికగా తెరకెక్కిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా. మల్లి అనే యువతిని ప్రాణంగా ప్రేమించే కథానాయకుడి జీవితంలోకి మరో వ్యక్తి రావడంతో అతని ప్రేమకు పెద్ద పరీక్ష ఎదురవుతుంది. తన ప్రేమను గెలుచుకోవడానికి అతడు చేసే పోరాటం, ఎదురయ్యే సవాళ్లు, త్యాగాలు కథలో ప్రధానాంశాలు. రొమాన్స్‌తో పాటు యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు మరింత దగ్గర చేయనున్నాయి. ఇది జూలై 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

మొత్తంగా చూస్తే.. జూలై చివరి వారం ప్రతి రుచికి తగ్గ సినిమా థియేటర్లలో అందుబాటులో ఉండబోతోంది. యాక్షన్, రొమాన్స్, హారర్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా.. ఏ జానర్ అభిమానులైనా ఈ వారం తమకు నచ్చిన సినిమాను ఎంచుకునే అవకాశం ఉండడంతో బాక్సాఫీస్ వద్ద సందడి పీక్‌కు చేరే సూచనలు కనిపిస్తున్నాయి. మరి బాక్సీఫీస్ వద్ద ఎలాంటి రికార్డుల సృష్టిస్తాయో చూడాలి మరి.