అందరినీ అమ్మలా చూసుకునే నర్స్ అమ్మకూ ఒకరోజు.. ఇవాళ (మే 12) అంతర్జాతీయ నర్స్ల దినోత్సవం

అందరినీ అమ్మలా చూసుకునే నర్స్ అమ్మకూ ఒకరోజు.. ఇవాళ (మే 12)  అంతర్జాతీయ నర్స్ల  దినోత్సవం

ఆపద సమయంలో  ఆస్పత్రికి  వెళ్లగానే  తెల్లటి దుస్తులు,  తలపై చిన్న క్యాప్,  నిర్మలమైన మనస్సు, ఆప్యాయమైన పలకరింపు, ఆమెను చూడగానే ఒక భరోసా.   ఇక మన ప్రపంచంలోకి  అడుగుపెట్టిన చంటి పాపని మొట్టమొదట చూసి నూతన ప్రపంచానికి పరిచయం చేసేది ఆమే.  ఆమె అవసరం  తీసుకోకుండా తల్లి గర్భం నుంచి బయటకు  అడుగుపెట్టని పరిస్థితి,  ప్రతి ఒక్కరి  జీవితంలో  ఆమె అవసరం లేకుండా ఉండనివారు ఈ  ప్రపంచంలో లేరంటే అతిశయోక్తి  కాదు.  

ఆమె ఎవరో కాదు  ప్రస్తుతం  నర్సింగ్  ఆఫీసర్​గా   అందరినీ  అమ్మలా చూసుకునే 'నర్స్'.  ఆమె సేవలకు గుర్తుగా  ప్రతి ఏటా మే 12న అంతర్జాతీయ నర్స్​ల  దినోత్సవం  జరుపుకుంటాం.  ఇటలీలో  ఫ్లోరెన్స్  నైటింగేల్  1820  మే 12వ  తేదీన జన్మించింది.  1853లో  లండన్​లోని  ఓ స్త్రీల  ఆసుపత్రిలో  సూపరింటెండెంట్​గా  పనిచేసింది. 

 1854లో  క్రిమియా యుద్ధంలో టర్కీలో  గాయపడిన సైనికులకు సేవలు చేయడానికి  నర్సుల బృందాన్ని  తీసుకెళ్లి  సైనికులకి  విశేషంగా  వైద్య సేవలు అందించింది.  అర్ధరాత్రి  కూడా చిన్న లాంతర్ పట్టుకుని  యుద్ధంలో గాయాలపాలై  బాధతో  విలవిలలాడుతున్న  సైనికులను ఓదారుస్తూ  వారిలో ధైర్యాన్ని నింపేది.  దాంతో అక్కడి వారందరూ  నైటింగేల్ ను  'లేడీ విత్ ద లాంప్' అనే పిలవడంతో  ఆమెకు  ఆ పేరు  సార్ధకమైంది.

  • ప్రజారోగ్యాన్ని రక్షించడమే ప్రధాన ధ్యేయం

1859లో 'నోట్స్ ఆన్ నర్సింగ్ ' అనే పుస్తకాన్ని రచించింది.  ప్రపంచంలోనే  మొదటి నర్సుల శిక్షణ కాలేజీని కూడా ఆమే స్థాపించింది.   నైటింగేల్  సేవలను గుర్తించిన 'ఇంటర్నేషనల్  కౌన్సిల్ ఆఫ్ నర్సెస్'  సంస్థ 1965 నుంచి నైటింగేల్  పుట్టిన రోజు  మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా  ప్రకటించారు.  

 నిత్యం  అనేక రకాల వ్యాధులతో  బాధపడుతున్న రోగుల మధ్య ఉంటూ వారికి వైద్య సేవలు అందిస్తున్న సమయంలో  ఒక్కోసారి బ్యాక్టీరియా  ఇన్ఫెక్షన్ గురై  తీవ్ర అనారోగ్యం బారినపడి మరణించినవారు సైతం లేకపోలేదు.   కరోనా సమయంలో  ప్రతివారికి అండగా ఉంటూ  ధైర్యాన్ని నింపినవారిలో నర్సులు కూడా ప్రముఖస్థానంలో ఉన్నారు.   కరోనా  బాధితులకు సైతం వైద్య సేవలు  అందించే క్రమంలో  నర్సులు కొవిడ్ బారినపడి  మృత్యువాత పడ్డారు. 

 తమ ప్రాణాన్ని అడ్డుగాపెట్టి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడమే ప్రధాన ధ్యేయంగా నర్సులు సేవలు అందించారు.   వారి సొంత  కుటుంబాల కంటే ఎక్కువగా  ప్రజల  ఆరోగ్య పరిస్థితిపైనే  దృష్టి  సారించి  విధి  నిర్వహణలో  అనేకమంది  అసువులు  బాసారు.   ఆరోగ్య  సమాజాన్ని  నిర్మించాలంటే  నర్సుల పాత్ర చాలా కీలకం.  ఆరోగ్యంపై  ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి ఖాళీగా ఉన్న నర్సు పోస్టులను  భర్తీ చేసి ప్రజలకు మరింత వైద్య సేవలు అందేలా కృషి చేయాలని కోరుకుందాం. 

- తాళ్ళపెల్లి సురేందర్