భారత ప్రజాస్వామ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రివర్గ సమావేశాలు చాలా కీలకంగా భావిస్తాం. ఈ నిర్ణయాలు అత్యంత విలువైనవి, ప్రజా అవసరాలకు అనుగుణంగా తీసుకుంటారు అనే భావన కూడా ఉన్నది. ఇంత ప్రాముఖ్యత కలిగిన మంత్రివర్గ సమావేశాలకు సంబంధించి ప్రజలకు తెలిసే అవకాశాలు, తెలిపే మార్గాలు కూడా అతి తక్కువ. కేంద్ర సమాచార హక్కు చట్టంలో కూడా ఈ సమావేశాల సమాచారం గోప్యంగా ఉంచే అవకాశం ప్రభుత్వం కల్పించుకున్నది. ప్రభుత్వం చేసే ప్రతి పని, కేవలం రక్షణ వ్యవహారాలు మినహాయించి, ప్రతిదీ ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్నందున మంత్రివర్గ సమావేశాలకు సంబంధించిన సమాచారం గోప్యంగా ఉంచడం సరికాదు.
సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం, 2005 ప్రకారం, నిర్ణయాలకు ముందు జరిగే ప్రక్రియ గోప్యంగా ఉంచేందుకు మంత్రిమండలి చర్చల రికార్డులతో సహా కేబినెట్ పత్రాలకు సాధారణంగా మినహాయింపు ఉంటుంది. అయితే,
ఈ మినహాయింపు పూర్తిగా వర్తించదు. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాలకు గల కారణాలు, ఆ నిర్ణయాల
ఆధారంగా తీసుకున్న సమాచారం ఇవన్నీ, సదరు నిర్ణయం ఖరారై, సంబంధిత వ్యవహారం పూర్తయిన వెంటనే తప్పనిసరిగా
ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఈ చట్టం నిర్దేశిస్తోంది.
కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ మంత్రివర్గ నిర్ణయాలను తమ అధికారిక వెబ్‌సైట్‌లు లేదా పోర్టల్‌లలో స్పష్టంగా ప్రచురిస్తున్నాయి. కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ), ఇతర కేంద్ర పోర్టల్స్ ప్రచురిస్తాయి. సాధారణంగా మంత్రివర్గ నిర్ణయాలు ఒకరు లేదా ఇద్దరు మంత్రులు పత్రికా సమావేశంలో ప్రకటిస్తున్న ఆనవాయితీ
చూస్తున్నాం. ప్రజలకు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు అధికారికంగా యథాతథంగా తెలిసే అవకాశాలు చాలా తక్కువ.
- కేంద్ర, రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలలో కీలక నిర్ణయాలు
కేంద్ర, రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలలో చాలా కీలక నిర్ణయాలు ఉంటున్నాయి. కేంద్ర కేబినెట్ అయితే అంతర్జాతీయ ఒప్పందాలను కూడా ఆమోదిస్తున్నది. పార్లమెంటు వెలుపల కీలక అంతర్జాతీయ వాణిజ్య, ఇతర ఒప్పందాలను మంత్రివర్గం ఆమోదించే ముందు, తరువాత కూడా తగిన సమాచారం ప్రజల ముందుకు రావడం లేదు. కొన్ని నిర్ణయాలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పెడుతున్నారు. మిగతా సమాచారం మాత్రం అందుబాటులోకి రావడం లేదు.
ఢిల్లీ ప్రభుత్వం మాత్రం చాలా వివరంగా, తేదీ, నిర్ణయాలకు ఒక నెంబర్, సారాంశం లేదా పూర్తి నిర్ణయ పాఠం, వెబ్‌సైట్‌లో పెడుతున్నది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా మంత్రివర్గ నిర్ణయాలను వెబ్‌సైట్‌లో పెడుతున్నది. మధ్యప్రదేశ్, బిహార్, చత్తీస్గఢ్ రాష్ట్రాల మంత్రివర్గ నిర్ణయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా అనేక ఇతర రాష్ట్రాలు తమ మంత్రివర్గ నిర్ణయాలు ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదు. మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ శాతం భూమి కేటాయింపులు, చేపట్టబోయే ప్రాజెక్టులు వగైరా నిర్ణయాలు చూస్తుంటాం.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తీసుకున్న నిర్ణయాలు కేబినెట్ స్థాయిలో జరిగాయా లేదా అనేది వివాదాస్పదం అయ్యింది. అనూహ్యంగా దానికి సంబంధించిన పత్రాలే లేవు అనే నిర్ధారణకు వచ్చారు. కేబినెట్ సమావేశం జరిగింది, చర్చలు జరిగాయి, సమష్టి నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, సంబంధించిన పత్రాలు మాత్రం లేవు. కేబినెట్ నిర్ణయించిన పత్రాలకు భద్రత లేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ. మంత్రివర్గం తమ నిర్ణయాలకు జవాబుదారీ కాదు అనే సాధారణంగా భావించడానికి ఆస్కారం లోపించిన పారదర్శకత వల్ల ఏర్పడింది. కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషన్లు కూడా ఈ విషయంలో ఉదాసీనంగా ఉన్నాయి.
- నిర్దిష్టస్థాయి గోప్యత
సాధారణంగా మంత్రివర్గం ముందుకువచ్చే నిర్ణయాలు ఏ ఒక్క మంత్రి, ముఖ్యమంత్రి సహా, తీసుకోలేనివి సమష్టిగా మంత్రివర్గం నిర్ణయిస్తుంది. అయితే, ఈ నిర్ణయాలు కూడా ముందుగాని, తరువాతగాని శాసనసభలలో ప్రవేశపెట్టే ఒక మంచి సంప్రదాయం ఉండేది. క్రమంగా అదీ పోయింది. ముఖ్యమంత్రి కార్యాలయాలు మంత్రివర్గం ముందుకువచ్చే అంశాలను, నిర్ణయాలను నిర్ధారిస్తున్నారు. పరిపాలనలో అత్యున్నత స్థాయి అధికారి ముఖ్య కార్యదర్శి కార్యాలయం పాత్ర కూడా తగ్గిపోయింది. అస్మదీయులకు ఉపయోగపడే నిర్ణయాలు ముఖ్యమంత్రుల కార్యాలయం ద్వారా మంత్రివర్గం నిర్ణయిస్తున్న వైనాలు అనేకం.
కేబినెట్ నిర్ణయాలు కోర్టు పరిధిలోకి రావు అని భావించి అనేక వివాదాస్పద నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక అంశాలు, ప్రాజెక్టు అమలు వేగిరపరిచే ఆలోచనతో మంత్రివర్గ స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. కోర్టులలో కూడా కేబినెట్ నిర్ణయం తీసుకున్నది కాబట్టి ఇది కోర్టు పరిధిలోకి రాదు అనేవిధంగా వాదనలు నడుస్తున్నాయి. భారత రాజ్యాంగం మొత్తం మంత్రివర్గ ప్రక్రియకు సామూహిక బాధ్యత సూత్రం నిర్వచించింది. ఇది మంత్రివర్గ కార్యకలాపాలకు సంబంధించి ఒక నిర్దిష్ట స్థాయి గోప్యతను తప్పనిసరి చేస్తుంది. మంత్రులు రాష్ట్రపతి లేదా గవర్నర్ సమక్షంలో గోప్యతా ప్రమాణం చేస్తారు.
ఇది వారి కార్యకలాపాలు, విధానాలు, నిర్ణయాలకు సంబంధించిన సమాచారాన్ని బయటపెట్టకుండా వారిని కట్టుబడి ఉండేలా చేస్తుంది. అయితే ఈ గోప్యత ప్రజా ప్రయోజనాలకు, చట్టపరమైన పరిశీలనకు లోబడి ఉంటుంది. కేబినెట్ రహస్యాలకు రక్షణ కల్పించగలిగినప్పటికీ, ఈ రక్షణ నిరవధికం కాదని న్యాయస్థానాలు తీర్పునిచ్చాయి.
మంత్రివర్గ ఉప సంఘాల
- కార్యకలాపాలు వెల్లడించాలి
మంత్రివర్గ సమావేశాలు, వాటి నిర్ణయాలు, పారదర్శకత ఒక అంశం కాగా మంత్రివర్గ ఉప సంఘాలు కూడా ఈ మధ్య ఏర్పాటు అవుతున్నాయి. ఈ ఉప సంఘాలు కార్యకలాపాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. చాలా ముఖ్యమైన, ప్రజలతో లేదా ప్రత్యేకవర్గాలతో సంప్రదింపులు జరపడానికి ఇవి ఏర్పాటు చేస్తున్నా, అనేక నిర్ణయాలు ఈ ఉప సంఘాలు తీసుకుంటున్న దరిమిలా ఇవి కూడా ప్రజల ముందుకు నేరుగా లేదా శాసనసభ ద్వారా ప్రజలకు వెల్లడించాల్సిన ప్రజాస్వామిక అవసరం ఉన్నది.
భారతదేశంలో ఇటీవల తీసుకున్న రాష్ట్రాల మంత్రివర్గ నిర్ణయాలు ఎక్కువగా భూ కేటాయింపులు, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి, సామాజిక సంక్షేమం మీద ఉన్నాయి.
ఎందుకు అంటే భారత రాజ్యాంగంలోని రాష్ట్ర జాబితా (ఎంట్రీ 18, జాబితా II) పరిధిలోకి భూ హక్కులు వస్తాయి కాబట్టి, భూ నిర్వహణ, ప్రభుత్వ విధానానికి రాష్ట్ర ప్రభుత్వాలే ప్రాథమిక అధికార పరిధిని కలిగి ఉంటాయి. అందువల్ల, కేబినెట్ నిర్ణయాలలో తరచుగా భూ కేటాయింపులు ఉంటాయి. పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ప్రజా సేవలకు భూమి ఒక కీలకమైన వనరు. పారదర్శకతను నిర్ధారించడానికి, విచక్షణారహిత దుర్వినియోగాన్ని నివారించడానికి, విస్తృత ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండటానికి దీనికి ఉన్నతస్థాయి కార్యనిర్వాహక ఆమోదం అవసరం.
- మంత్రివర్గ నిర్ణయాలను పరిశీలించే అవకాశం ప్రజలకు ఉండాలి
శాసనసభ కాకుండా మంత్రివర్గం ప్రభుత్వ విధానాలను నిర్దేశించి నియంత్రిస్తుంది.
కాగా శాసనసభ ఆ నిర్ణయాలకు అవసరమైన చట్టపరమైన చట్రం, ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని కల్పిస్తుంది. ఈ విధంగా జరగాలంటే మంత్రివర్గ నిర్ణయాలు శాసనసభలో ప్రవేశపెట్టాలి, చర్చించాలి, ఆమోదించాలి. భారతదేశంలో కేబినెట్ నిర్ణయాలు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటాయి. భారత రాజకీయ, పరిపాలనా వ్యవస్థలో కేబినెట్ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ కాగా, శాసనసభ (పార్లమెంట్) ప్రధానంగా ఈ నిర్ణయాలను ధృవీకరించి, పరిశీలిస్తుంది.
శాసనసభలో ఈ నిర్ణయాలను ప్రవేశపెట్టడం లేదు. ఇక పరిశీలనకు ఆస్కారం లేకుండాపోయింది. ప్రజలకు, ప్రజా వనరులకు, ప్రజా ప్రయోజనాల కోసం మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంటే మంచిదే. కానీ, వాటిని పరిశీలించే అవకాశం ప్రజలకు ఉండాలి. లేదా ఇతర రాజ్యాంగ వ్యవస్థలకు ఉండాలి. లేకుంటే, అస్మదీయులకు ప్రయోజనకారిగా, అవినీతిపర ఆదాయానికి, జవాబుదారీతనానికి దూరంగా మంత్రివర్గం నిర్ణయాలు ఆలవాలంగా మారుతున్నాయి. మంత్రివర్గ నిర్ణయాలు నిర్దిష్టమైన పత్రాలు, సహేతుకమైన లక్ష్యాలు, కారణాలు, హేతుబద్ధత కలిగి ఉండాలంటే అవి ప్రభుత్వంలో, ప్రజాస్వామ్యంలో పొందుపరిచిన పారదర్శక సూత్రాలకు లోబడి ఉండాలి. పాత కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన అన్ని పత్రాలు, ప్రతిపాదనలు, అభిప్రాయాలు, విధిగా, నిర్దిష్ట కాల పరిమితి తరువాత పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్యం మీద విశ్వాసం పెరుగుతుంది.
- డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్
