Work From Home: ప్రధాని మోడీ పిలుపుతో ఐటీ కారిడార్లలో ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ దిగ్గజాలకు ఈ ప్రకటన కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు మరలాలంటూ మోదీ పిలుపునివ్వడంతో.. బెంగళూరు కేంద్రంగా పనిచేసే రియల్ ఎస్టేట్ కంపెనీల షేర్లు సోమవారం ఒక్కసారిగా కుప్పకూలాయి. ఐటీ హబ్‌లలో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ తగ్గిపోతుందనే భయంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అమ్ముకునేందుకు ఎగబడ్డారు.
బెంగళూరు రియల్టీ షాక్:
హైదరాబాద్ సభలో మోడీ ప్రసంగం ముగిసిన మరుసటి రోజే మార్కెట్ తీవ్రంగా రియాక్ట్ అయ్యింది. దీంతో బెంగళూరుకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ షేర్లు దాదాపు 2.96 శాతం, పురవంకర స్టాక్ 2.20 శాతం, బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 1.17 శాతం మేర నష్టపోయాయి. మొత్తంగా నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 2.32 శాతం పతనమై 804.50 స్థాయికి పడిపోయింది. ఆఫీసులకు ఉద్యోగులు రావడం తగ్గిపోతే.. కమర్షియల్ లీజులు, కొత్త ప్రాజెక్టులపై ప్రభావం పడుతుందనే ఆందోళన రియల్టీ కంపెనీలను ప్రస్తుతం వెంటాడుతోంది.
హైదరాబాద్‌పై ఎఫెక్ట్ ఉంటుందా?
ప్రధాని మోడీ ఈ పిలుపును స్వయంగా హైదరాబాద్‌లోనే ఇవ్వడంతో.. ఇక్కడి ఐటీ అండ్ రియల్ ఎస్టేట్ రంగాల్లో కూడా ఆందోళన మొదలైంది. బెంగళూరు తర్వాత దేశంలోనే అతిపెద్ద ఐటీ హబ్‌గా ఉన్న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం వంటి ప్రాంతాల్లో వేల సంఖ్యలో చిన్నా పెద్ద ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఏదైనా అధికారిక నోటిఫికేషన్ ఇస్తే.. హైదరాబాద్‌లోని కమర్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా కుదేలయ్యే ప్రమాదం ఉంది. ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తే.. ఆఫీస్ స్పేస్ అద్దెలు తగ్గడమే కాకుండా, వాటి చుట్టూ ఉన్న హాస్టళ్లు, హోటళ్లు, ట్రాన్స్‌పోర్ట్ రంగంపై ప్రభావం ఎక్కువగానే ఉండనుంది.
ఉద్యోగ సంఘాల డిమాండ్:
ప్రధాని మోడీ కేవలం పిలుపునిస్తే సరిపోదని.. దీనికి సంబంధించి కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలని జారీ చేయాలని ఐటీ ఉద్యోగ సంఘాలైన FITE, NITES కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరగిన వేళ పెట్రోల్ వాడకాన్ని తగ్గించి ఫారెక్స్ ఆదా చేయడమే మోడీ ప్లాన్. అయితే ఈ ఆర్థిక దేశభక్తి ప్లాన్ ఐటీ ఉద్యోగులకు సంతోషాన్ని కలిగిస్తున్నా.. కోట్లు కుమ్మరించి భారీ ఆఫీస్ భవనాలను నిర్మిస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీలకు మాత్రం అశనిపాతంలా మారింది. రేపు ప్రభుత్వం ఎలాంటి అధికారిక గైడ్‌లైన్స్ ఇస్తుందోనని అటు బెంగళూరు.. ఇటు హైదరాబాద్ ఐటీ కారిడార్లలో పెద్ద చర్చ కొనసాగుతోంది. ఈ పరిస్థితులు ఎన్నాళ్లు ఉంటాయ్..? ఒకవేళ ఎక్కువ కాలం ఇదే పరిస్థితి కొనసాగితే ఇళ్ల అమ్మకాలు కూడా దెబ్బతింటాయని రియల్ ఎస్టేట్ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి.
